Virender Sehwag: ఆ విషయంలో మాస్టర్‌ని కాపీ చేశా: సెహ్వాగ్
Virender Sehwag: స్ట్రయిట్ డ్రైవ్ ఆడడంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ దిట్ట.
Virender Sehwag: స్ట్రయిట్ డ్రైవ్ ఆడడంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ దిట్ట. చూడచక్కని షాట్లతో బౌలర్లను సైతం ఆశ్చర్యానికి గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి లిటిల్ మాస్టర్ కెరీర్‌లో. గంటకు 150 కిమీ వేగంతో వచ్చే బంతులను సైతం.. క్షణాల్లోనే బౌండరీకి తరలించేవాడు. అందుకే స్ట్రయిట్ డ్రైవ్‌లను ఆడడంలో సచిన్ రూటే సపరేటులా ఉండేది.
అయితే తాజాగా వీరేంద్ర సెహ్వాగ్.. ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ... 1992 ప్రపంచ కప్‌లో సచిన్ స్ట్రయిట్ డ్రైవ్‌లను చూసి, అనంతరం వాటిని నేను కాపీ కొట్టి పలు మ్యాచ్‌ల్లో ఆడానని వెల్లడించాడు. క్రికెట్ లెర్నింగ్ యాప్ CRICURUని ఆయన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సెహ్వాగ్ మాట్లాడుతూ.. ''గ్రౌండ్‌లో మనందరం క్రికెట్ ఆడతాం. కానీ.. బయటే క్రికెట్ గురించి చాలా ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉంది. దీనికి నేనే ఉదాహరణ. 1992 వరల్డ్‌కప్ నుంచి నేను క్రికెట్‌ని చూస్తున్నాను. ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్ స్ట్రయిట్ డ్రైవ్‌లను బాగా పరిశీలించేవాడిని. అలా చూసే నేను వాటిని ప్రాక్టీస్ చేశాను. అనంతరం అలాంటి స్ట్రయిట్ డ్రైవ్ లను నేను ఆడాను. ఇది ఒక్కటే కాదు.. బ్యాక్‌ఫుట్ పంచ్‌ని కూడా మాస్టర్‌ని చూసి నేర్చుకున్నా. కేవలం టీవీలో సచిన్ ఆటని చూసి ఎంతో నేర్చుకున్నా. కానీ.. ప్రస్తుతం మీ ఫేవరెట్ ప్లేయర్ బ్యాటింగ్ మొత్తం వీడియోల ద్వారా మనకు అందుబాటులో ఉంది. కానీ.. మా రోజుల్లో ఇలాంటి సదుపాయాలు లేవు'' అని చెప్పుకొచ్చాడు.
కాగా, 1999లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన వీరూ.. తక్కువ కాలంలోనే తిరుగులేని ఓపెనర్‌గా ఎదిగాడు. సచిన్ టెండూల్కర్‌తో కలిసి ఓపెనర్‌గా ఎక్కువకాలం ఆడిడు సెహ్వాగ్. వీరూ కెరీర్‌లో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అలాగే టెస్టుల్లో రెండు ట్రిఫుల్ సెంచరీలు చేసిన సెహ్వాగ్.. వన్డేల్లోనూ డబుల్ సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే.