IPL 2023: వారెవ్వా.. లక్ అంటే కోహ్లిదే.. ఫైన్ల రూపంలో కట్టింది రూ.1.43 కోట్లు.. వచ్చింది మాత్రం రూ.8 కోట్లు..ఎలానో తెలుసా?
Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ కొనసాగుతోంది.
Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ కొనసాగుతోంది. ఈ సీజన్ లో 300కి పైగా పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. దీంతో పాటు వరుసగా 14 సీజన్లలో 300కి పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ మాత్రమే. అలాగే ఐపీఎల్ లో 50 ప్లస్ స్కోర్ 50 సార్లు చేసిన ఇండియన్ క్రికెటర్ గా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు టీ20ల్లో ఒకే స్టేడియంలో 3000 అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా కూడా కోహ్లీ రికార్డులకెక్కాడు. కోహ్లీ ఖాతాలో ఓ చెత్త రికార్డు కూడా ఉంది. ఐపీఎల్ లో అత్యధిక సార్లు గోల్డెన్ డకౌట్ అయిన జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు.
పరుగుల విషయంలో రన్ మెషీన్ గా క్రేజ్ సాధించిన కోహ్లీ...ఫైన్ల విషయంలో కూడా ఎవరికీ సాధ్యం కానీ రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు 16వ సీజన్ లో 9 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 3 సార్లు జరిమానా కట్టాడు. ఏప్రిల్ 17న చెన్నై సూపర్ కింగ్స్ తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలిసారి విరాట్ కోహ్లీకి ఐపీఎల్ నిర్వాహకులు అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. ఐపీఎల్ నిబంధనల్లోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినందుకుగాను లెవల్ 1 అఫెన్స్ కింద అతనికి ఫైన్ విధించినట్లు ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించింది.
సీఎస్కే బ్యాట్స్ మెన్ శివమ్ దూబే ఔటైన సమయంలో కోహ్లీ కాస్త ఓవర్ గా ప్రవర్తించాడు. అంతకుముందు గైక్వాడ్ ఔటైనప్పుడు కూడా అగ్రెసివ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ దూకుడు కారణంగానే కోహ్లీకి ఈ సీజన్ లో ఫస్ట్ టైమ్ బీసీసీఐ షాకిచ్చింది. ఈ ఘటన తర్వాత రాజస్థాన్ రాయల్స్ తో ఏప్రిల్ 23న జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ కు రెండో సారి ఫైన్ పడింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్ లో నిర్ణీత సమయానికి ఓవర్లు పూర్తి చేయడంలో ఆర్సీబీ విఫలం అయింది. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.24 లక్షల జరిమానా విధిస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు.
ఇక మే 1న లఖ్ నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ సందర్భంగా విరాట్ కు ఈ సీజన్ 3వ సారి ఫైన్ పడింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే క్రమంలో లఖ్ నవూ మెంటార్ గౌతమ్ గంభీర్ – విరాట్ మధ్య మైదనాంలో గల్లీ క్రికెట్ ను తలపించే విధంగా మాటలయుద్ధం జరిగింది. వీరి ప్రవర్తనను సీరియస్ గా తీసుకున్న ఐపీఎల్ యాజమాన్యం ఇరువురిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించింది. ఇలా విరాట్ కోహ్లీపై ఈ సీజన్ లో మూడు సార్లు క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో రూ.1.43 కోట్ల రూపాయల జరిమానా కట్టాల్సి వచ్చింది. కోహ్లీ కట్టిన జరిమానాతో కనీసం 5 మంది ఐపీఎల్ ప్లేయర్లను కొనుగోలు చేయొచ్చు.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే గంభీర్ తో వివాదం జరిగిన మరుసటి రోజే విరాట్ కోహ్లీ తన ఖాతాలో రూ.8 కోట్లకు పైగా జమ చేసుకున్నాడు. తన ఇన్ స్టా నుంచి గ్రేట్ లెర్నింగ్ వీడియోని షేర్ చేసిన కోహ్లీ రూ.8.9 కోట్లు అందుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ జరిమానాలో ఎంత పోయిందో అంతకంటే 8 రెట్లు కోహ్లీ సాధించాడని సంబరపడుతున్నారు.