IPL 2023: ప్లేఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే.. హర్భజన్ సింగ్ జోస్యం..!
IPL 2023: ఐపీఎల్ 2023 రసవత్తరంగా సాగుతోంది. 16వ సీజన్ లో ప్లేయర్లు దంచికొడుతున్నారు.
IPL 2023: ఐపీఎల్ 2023 రసవత్తరంగా సాగుతోంది. 16వ సీజన్ లో ప్లేయర్లు దంచికొడుతున్నారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దాదాపు అన్ని మ్యాచుల్లోనూ భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి. అత్యధిక స్కోరింగ్ రేట్ నమోదు చేసిన సీజన్ ఇదే కావడం విశేషం. 2018 సీజన్ ముగిసే సమయానికి స్కోరింగ్ రేట్ 8.65 కాగా ఆ రికార్డును 2023 సీజన్ బ్రేక్ చేయడం గ్యారెంటీ. ఇకపోతే ప్లే ఆఫ్స్ దగ్గరపడుతున్న వేళ టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లే ఆఫ్స్ ఆడబోయే నాలుగు జట్ల పేర్లను హర్భజన్ వెల్లడించారు.
హర్భజన్ అంచనా ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఈ 16వ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయని తెలిపారు. తన అంచనాలు తప్పే ఛాన్స్ లేదని హర్భజన్ అంటున్నారు. మరోవైపు లఖ్ నవూ సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ సైతం ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టే అవకాశం ఉన్నా తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మూడు జట్లు ప్లే ఆఫ్స్ కోసం గట్టిపోటీ ఇస్తాయన్నారు. అయితే ఈ సీజన్ లో ఏ జట్టు ఛాంపియన్ గా నిలుస్తుందో అప్పుడే ఒక అంచనాకు రాలేమన్నారు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో ఉంది. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో 6 విజయాలు 3 పరాజయాలతో 12 పాయింట్లు సాధించి పట్టికలో తొలిస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో 11 పాయింట్లతో లఖ్ నవూ సూపర్ జెయింట్స్ నిలిచింది. సీఎస్ కే 11 పాయింట్లతో 3వ స్థానంలో ఉంటే 10 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ 4వ స్థానాన్ని , 10 పాయింట్లతో 5వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచాయి.