Asia Cup 2022: ఆసియా కప్‌పోటీల్లో సూపర్ 4లో టీమిండియా తొలివిజయం
Asia Cup 2022: టీమిండియా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు
Asia Cup 2022: ఆసియాకప్ క్రికెట్ పోటీల్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 101 పరుగుల తేడాతో విజయ బావుటా ఎగురవేసింది. ఆసియా కప్ సూపర్ 4లో తొలివిజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడిన భారత్, మ్యచ్‌లోమాత్రం అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లీ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. విరాట్ కోహ్లీ టీ20 కెరీర్లో తొలి శతకాన్నినమోదుచేసి అజేయంగా నిలిచాడు. ఈమ్యాచ్‌లో 3500 పరుగులు మైలురాయిని అధిగమించాడు. వక్తిగత అత్యధిక స్కోరుతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీని ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వరించింది. భువనేశ్వర్ కుమార్ ఇదే మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌ను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. 20 ఓవర్లలో 110 పరుగులు చేయగలిగింది. దీంతో టీమిండియా 101 పరుగుల తేడాతో విజయం కైవసం చేసుకుంది.
విరాట్ కోహ్లీ 61 బంతులు ఎదుర్కొని 12 బౌండరీలు, 6 సిక్సర్లతో 122 పరుగులు సాధించాడు. కెప్టెన్ లోకేశ్ రాహుల్ 41 బంతుల్లో 6 బౌండరీలు, 2 సిక్సర్లతో 62 పరుగులు అందించాడు. రిషబ్ పంత్ 20 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 6 పరుగులు నమోదుచేశారు. 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 212 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్థాన్‌కు నిర్థేశించింది. 213 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకిదిగిన ఆఫ్ఘనిస్థాన్ ప్రారంభ ఓవర్లోనే రెండువికెట్లు చేజార్చుకుంది. ఆతర్వాత క్రమంగా వచ్చిన వారు వచ్చినట్లే పెవీలియన్ బాట పట్టారు. ఇబ్రహీం జర్ఢాన్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా రాణించాడు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు, అర్షదీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ హుడా ఒక్కో వికెట్ తీశారు.
ఆసియా కప్ పోటీల్లో ప్రారంభ దశలో వరుసవిజయాలతో దూసుకొచ్చిన టీమిండియా... సూపర్ 4 మ్యాచుల్లో చతికిల పడింది. తొలుత పాకిస్థాన్, ఆతర్వాత శ్రీలంక జట్లతో పోటీపడి పరాజయాన్ని చవిచూసింది. సూపర్ 4లో జరిగిన మ్యాచ్‌లో తొలినుంచి టీమిండియా అద్భుత ప్రదర్శనచేసి ఆఫ్ఘనిస్థాన్‌కు విజయ లక్ష్యాన్ని నిర్థేశించింది. భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బంతుల్ని సంధించి ఆఫ్ఘనిస్థాన్‌ను ఇబ్బంది పెట్టాడు. నాలుగు ఓవర్లు వేసిన భువనేశ్వర్ కుమార్ నాలుగు పరుగులిచ్చి ,ఐదు వికెట్లను పడగొట్టాడు.