Ravi Shastri: టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి బెట్టింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ లో స్పోర్ట్స్ బెట్టింగ్‌ను చట్టబద్దం చేయాలని అలా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపాడు. బెట్టింగ్‌ను నిర్మూలించాలని చూసిన ఏదో ఒక రకంగా అవి జరుగుతూనే ఉన్నాయని చట్టబద్దం చేయడం వలన బెట్టింగ్‌పై నిఘా ఉంచేందుకు కూడా అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డాడు. కొన్ని ఏళ్ళుగా ఈ బెట్టింగ్ లు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.
భారత్ లో క్రికెట్‌పై భారీగా బెట్టింగ్‌లు నడుస్తుంటాయి. అందులో ముఖ్యంగా భారత్ - పాకిస్థాన్ మ్యాచ్, ఐపీఎల్ వంటి సమయాలలో వేల కోట్లు చేతులు మారుతుంటాయి. ఈ కారణంగా బెట్టింగ్‌ను లీగల్ చేయాలనే వాదన కొంతకాలంగా వినిపిస్తోంది. రవిశాస్త్రి కన్నా ముందు కూడా పలువురు బెట్టింగ్‌కు చట్టబద్దత కల్పించాలని సూచించారు. మరోపక్క బెట్టింగ్‌ను చట్టపరం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్‌ను లీగలైజ్ చేస్తే ఇక చాలా మంది అదే పనిగా పెట్టుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.