బుక్ లాంచ్ కి వెళ్ళారు.. కరోనాకి బుక్ అయ్యారు..టీమిండియాలో మరో ఇద్దరికీ పాజిటివ్
* టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ లో కరోనా కలకలం రేపుతుంది.
Team India Coach Ravi Shastri: టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ లో కరోనా కలకలం రేపుతుంది. భారత కోచ్ రవిశాస్త్రికి ఆదివారం కరోనా పాజిటివ్ గా తేలడంతో అతనికి సన్నిహితంగా ఉన్న ఫిజియో నితిన్ పటేల్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ తో పాటు బౌలింగ్ కోచ్ అరుణ్ లను ఐసోలేషన్ లో ఉంచారు. సోమవారం ఈ ముగ్గురికి ఆర్టీపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా బౌలింగ్ కోచ్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. బబుల్ నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల జరిగిన "స్టార్ గేజర్" అనే బుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లి, రవిశాస్త్రితో పాటు మరికొంత మంది భారత ఆటగాళ్ళపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) సీరియస్ గా ఉంది.
ఆ బుక్ లాంచ్ కార్యక్రమానికి హాజరు కావడం వల్లనే కరోనా బారినపడ్డట్లు ప్రాధమికంగా బిసిసిఐ అంచనా వేసింది. బబుల్ నిబంధలను అతిక్రమించిన వీరిపై చర్యలు తప్పవని బిసిసిఐ హెచ్చరించినట్లు సమాచారం. దీంతో సెప్టెంబర్ 10న మాంచెస్టర్ లో జరగబోయే ఐదో టెస్ట్ మ్యాచ్ కి హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ దూరంగా ఉండనున్నారు. ఇటీవల జరిగిన శ్రీలంక పర్యటనలో బబుల్ నిబంధనలు పాటించక క్రునాల్ పాండ్య కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా రవిశాస్త్రితో పాటు మరో ఇద్దరికీ కూడా పాజిటివ్ రావడంతో ఇంకా ఎంత మంది వారికి సన్నిహితంగా ఉన్నారో ఎవరికీ కరోనా సోకుతుందోనని జట్టు యాజమాన్యం టెన్షన్ పడుతుంది.