T20 World Cup: భారత్‌లో ఐసీసీ ప్రపంచకప్ లేనట్లే!
T20 World Cup: ఐసీసీ ప్రపంచకప్ ఆతిథ్యాన్ని ఇండియా మిస్ చేసుకోనుందా..?
T20 World Cup: ఐసీసీ ప్రపంచకప్ ఆతిథ్యాన్ని ఇండియా మిస్ చేసుకోనుందా..? ఐపీఎల్‌ను వాయిదా వేసుకున్న బీసీసీఐ.. టీ 20 వరల్డ్‌కప్ నిర్వహించడానికి కూడా వెనుకడుగు వేస్తోందా..? డెడ్‌లైన్ విధించినా భారత క్రికెట్ బోర్డు ఎందుకు నోరు మెదపడం లేదు. ఇంతకీ బీసీసీఐ మనసులో ఏముంది..?
టీ20 వరల్డ్ కప్ ఇండియాలో నిర్వహించడం కుదిరే పనిలా కనిపించడం లేదు. దేశంలో కోవిడ్ ఇంకా కంట్రోల్‌లోకి రాకపోవడంతో ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌లో జరగాల్సిన టోర్నీ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ విషయంపై బీసీసీఐని ఈనెల 28 వరకు సమాధానం చెప్పాలని డెడ్‌లైన్ విధించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అయితే ఆ డెడ్‌లైన్ టైమ్ కంటే ముందే బీసీసీఐ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీని భారత్‌లో నిర్వహించకపోవడమే బెటర్ డిసిషన్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశంలో రోజుకు లక్షల కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు థర్డ్‌వేవ్ ముప్పు కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో టీ20 కప్ విషయంలో వెనుకడుగు వేయడమే కరెక్ట్ అని బీసీసీఐ ఆలోచన. అందుకే ఆతిథ్య హక్కులు యూఏఈ, ఒమన్‌కు ఇచ్చినా అభ్యంతరం లేదని ఐసీసీకి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఐసీసీ కూడా ఆతిథ్య దేశాన్ని మార్చేందుకు ప్రత్యామ్నాయాలు చూస్తున్నట్లు తెలుస్తోంది.
వరల్డ్‌కప్ కోసం దుబాయ్, అబుదాబి, షార్జాలతో పాటు, ఒమన్ దేశంలోని మస్కట్‌లో మ్యాచులు నిర్వహించాలని భావిస్తోంది. అయితే బీసీసీఐ నుంచి అధికారికంగా ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయకపోవడంతో జూన్ 28 వరకు నిర్ణయం ఎలా ఉండబోతుందనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.