ఇంగ్లాండ్ సిరీస్ నుంచి శ్రేయాస్ ఔట్; ఐపీఎల్ ఫస్ట్ హాఫ్‌లో కూడా డౌటే?

Shreyas Iyer: మంగళవారం పూణేలో ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి వన్డేలో శ్రేయాస్ ఎడమ భుజానికి దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే.

Update: 2021-03-24 13:31 GMT

శ్రేయాస్ అయ్యర్ (ఫొటో హన్స్ ఇండియా)

Shreyas Iyer: నిన్న (మంగళవారం) పూణేలో ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి వన్డేలో శ్రేయాస్ ఎడమ భుజానికి దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. అయితే.. సిరీస్ లో మిగతా రెండు మ్యాచ్‌లకు ఈ యంగ్ బ్యాట్స్ మెన్ దూరమయ్యాడు. నివేదికల ప్రకారం గాయం నుంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ యంగ్ టీమిండియా ప్లేయర్‌ మంచి ఫాంలో ఉన్నప్పుడే గాయాల బారిన పడుతుండడం కొంత కలవపెడుతుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా మారిన అయ్యర్.. ప్రస్తుత గాయంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఫస్ట్ హాస్ లో కూడా ఆడకపోవచ్చని సమాచారం. ఐపీఎల్ ఏప్రిల్ 9 న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

కాగా, ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ సమయంలో ఎనిమిదో ఓవర్ లో శ్రేయాస్ అయ్యర్ మైదానం వీడాడు. వెంటనే స్కానింగ్ కూడా తీశారు. అయితే గాయం తీవ్రమైందని, అందుకే ఆ తరువాత ఫీల్డింగ్ కు కూడా అతను రాలేదని సమాచారం.

అయితే అయ్యర్ పరిస్థితిపై బీసీసీఐ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. గాయం నయం కావడానికి చాలా వారాలు పడుతుందని నివేదిక పేర్కొంది. అయ్యర్ లేకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బేమీ కాదు. శ్రేయాస్ స్థానంలో ఆడేందుకు సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ సిద్ధంగా ఉన్నారు. కాగా, ఐపీఎల్ లో అయ్యర్ ఆడకపోతే.. ఢిల్లీ క్యాపిటల్స్ కు వైస్ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ జట్టుకు నాయకత్వం వహిస్తాడని భావిస్తున్నారు.

గత ఆరు నెలల కాలంలో భుజం గాయంతో శ్రేయాస్ బాధ పడడం ఇది రెండోసారి. గతేడాది ఆస్ట్రేలియాలో టీ20లో కూడా అయ్యర్ భుజం గాయంతో బాధపడ్డాడు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో శ్రేయాస్ చేరడానికి ముందు, అయ్యర్ ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో నాలుగు మ్యాచ్ లు ఆడాడు. ఇందులో అతను రెండు సెంచరీలు చేశాడు.

ఈ వేసవిలో రాయల్ లండన్ కప్ కోసం అయ్యర్ ఇంగ్లీష్ కౌంటీలకు సంతకం చేశాడు. తాజా గాయంతో ఈ మ్యాచ్‌లు కూడా ఆడలేని పరిస్థితి నెలకొంది? లంక్‌షైర్ జట్టులో జులై 15న చేరాల్సి ఉంది. అప్పటిలోగా శ్రేయాస్ పరిస్థితి మెరుగైతే.. కౌంటీ మ్యాచ్‌లు ఆడతాడు.

అయ్యర్ గత సంవత్సరం ఐపీఎల్ సీజన్‌ లో అద్భుతంగా రాణించాడు. అతను డీసీని మొట్టమొదటి ఫైనల్‌కు చేర్చాడు. దురదృష్టవశాత్తు ముంబై ఇండియన్స్ (ఎంఐ) చేతిలో డీసీ ఓడిపోయింది. ఐపీఎల్ 2021 లో డీసీ టీం తన మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తో ముంబైలో తలపడనుంది.

Tags:    

Similar News