Sachin Tendulkar: మనోవేదనతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా - సచిన్
Sachin Tendulkar: తన కెరీర్‌లో తీవ్ర మనోవేదనకు గురై.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు.
Sachin Tendulkar: తన కెరీర్‌లో తీవ్ర మనోవేదనకు గురై.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. అన్ అకాడమీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న లిటిల్ మాస్టర్ ఈ మేరకు తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నాడు.
ఆయన మాటల్లోనే.. ఇంకేమన్నాడో చూద్దాం..''నా కెరీర్‌లో 10 నుంచి 12 ఏళ్లపాటు తీవ్ర మనోవేదనకు లోనయ్యాను. ఈ కాలంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. క్రమేణా కాలం నాలో మార్పు తెచ్చింది. పరిస్థితులకు అనుగుణంగా మారి, ఆటకు ముందే మానసికంగా, శారీరకంగా సిద్ధమవడం అలవాటు చేసుకున్నాను. మానసిక ప్రశాంతతను పొందేందుకు నాకు నచ్చిన పనులు చేశానని'' సచిన్ తెలిపాడు.
''ఏ విషయం అయినా సరే మన మనసు అంగీకరించేలా సిద్ధం కావాలి. శారీరంకగానే బలంగా ఉంటే సరిపోదు.. మానసికంగా కూడా బలంగా తయారవ్వాలి. అప్పుడే ఒత్తిడిలో కూరుకపోకుండా.. ధైర్యంగా నిలబడగలం. అనుభవం దృష్ట్యా చెబుతున్నా. నిజానికి మైదానంలో అడుగుపెట్టే ముందు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవాడిని. ఒత్తిడి డామినేట్ చేసే సమయంలో టీ పెట్టడం, బట్టలు ఇస్త్రీ చేయడం, బ్యాగు సర్దుకోవడం వంటి పనులు చేసి.. మనసు దృష్టి మరల్చి.. ఒత్తిడి నుంచి బయటపడేవాడిని. నా చివరి మ్యాచ్ ఆడేంతవరకు ఇవే అలవాట్లను కొనసాగించానని'' సచిన్ తన అనుభవాలను వెల్లడించాడు.
అలాగే ''గాయాల వేధిస్తున్నప్పడు ఫిజియోలు, డాక్టర్లు రకరకాల పరీక్షలు నిర్వహించి, మనల్ని కాపాడతారు. అదేవిధంగా మెంటల్ హెల్త్ విషయంలో మనం వెనకడుగు వేయకూడదు. డాక్టర్ని కలిసి మన సమస్యను వివరించాలి. అందరి జీవితాల్లో ఎత్తుపళ్లాలు మామూలే. కానీ, ఇలాంటి సమయంలో ఆత్మీయుల అండ దొరికితే మనసు తేలికపడుతుంది. ముఖ్యంగా ఏ విషయాన్నైనా మనం స్వీకరించే గుణం అలవాటు చేసుకోవాలి. అప్పడే మన సమస్యలకు ఓ చక్కని పరిష్కారం దొరుకుతుంది'' అంటూ సచిన్ ముగించాడు.