IPL 2021: రాజస్థాన్ టార్గెట్ 222; బౌలర్లను ఊచకోత కోసిన పంజాబ్ ప్లేయర్స్ హూడా, గేల్, రాహుల్
IPL 2021: పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది.
IPL 2021: వాంఖడే వేదికగా ఈ రోజు రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ టీంల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి, పంజాబ్ కింగ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనింగ్ జంటగా వచ్చిన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరభించారు. కానీ, మయాంక్ అగర్వాల్(14 పరుగులు, 9 బంతులు, 2 ఫోర్లు) 2.4 ఓవర్లో చేతన్ సకారియా బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కానీ, ఆ తరువాత నుంచే అసలు ఆట మొదలైంది. రాహుల్, గేల్, దీపక్ హూడా బౌలర్లపై ఊచకోత మొదలుపెట్టారు.
ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన క్రిస్ గేల్ ఫోర్లు, సిక్సులతో మోత మోగించాడు. ఓ వైపు రాహుల్, మరోవైపు గేల్ రాజస్ఠాన్ బౌలర్లను ఊచకోత కోశారు. క్రిస్ గేల్ కేవలం 28 బంతుల్లో 40 పరుగులు (4ఫోర్లు, 2 సిక్సులు) చేసి, రియాన్ పరాగ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ౨ సిక్సులు బాదిన గేల్.. ఐపీఎల్ టోర్నీలో మొత్తం ౩౫౦ సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గేల్ ను ఔట్ చేశామనే ఆనందంలో ఉన్న రాజస్ఠాన్ బౌలర్లకు ఆ ఆనందం లేకుండా చేశాడు దీపక్ హూడా. క్రిస్ గేల్ అవుటయ్యాక బ్యాటింగ్ వచ్చిన దీపక్... వచ్చీ రాగానే బౌలర్లను చీల్చి చెండాడు. ఈ లోపు కెప్టెన్ రాహుల్ 30 బంతుల్లో హాప్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సిక్సర్ తో అర్థ సెంచరీ పూర్తి చేయడం గమనార్హం.
మరోవైపు దీపక్ హూడా కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ (6 సిక్సులు, 1 ఫోర్) పూర్తి చేసి ఔరా అనిపించాడు. హూడా, రాహుల్ ఎదరుదాడితో బౌలర్లు చేతులేత్తేశారు. ప్రతీ ఓవర్లో సిక్సులు, ఫోర్లు బాదడంతో బోర్డుపై స్కోరు వేగం పెరిగింది. ఈ దశలో 17.3 ఓవర్లో క్రిస్ మోరీస్ చేతికి చిక్కాడు దీపక్ హూడా (64 పరుగులు, 28 బంతులు, 4 ఫోర్లు, 6 సిక్సులు).
ఆవెంటనే పూరన్ ను ఔట్ చేసి, ఒకే ఓవర్లో రెండు వికేట్లు తీశాడు క్రిస్ మోరీస్. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ 50 బంతుల్లో 91 పరుగులు(6ఫోర్లు, 5 సిక్సులు) చేసి 19.2 ఓవర్లో చేతన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. అయితే పంజాబ్ కింగ్స్ ఒక్క మూడో ఓవర్లో తప్ప మిగతా అన్ని ఓవర్లలో బౌండరీలు సాధించడం విశేషం.
రాజస్థాన్ బౌలర్లలో క్రిస్ మోరీస్ 2 వికెట్లు తీయగా, చేతన్ 3 వికెట్లు, రియాన్ ఒక వికెట్ తీశారు.