Ashwin's YouTube Channel: ఆర్. అశ్విన్ సొంత యూట్యూబ్ ఛానెల్ డిస్కషన్‌పై వివాదం... స్పందించిన ఆటగాడు

Update: 2025-04-07 09:51 GMT

రవిచంద్రన్ అశ్విన్ సొంత యూట్యూబ్ ఛానెల్ డిస్కషన్‌పై వివాదం... స్పందించిన ఆటగాడు

R Ashwin's YouTube Channel: చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అశ్విన్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఛానెల్‌కు 1.6 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇందులో ఎప్పటికప్పుడు జరిగే క్రికెట్ టోర్నమెంట్స్ గురించి చర్చలు నడుస్తుంటాయి. ప్రస్తుతం అంతటా ఐపీఎల్ ఫీవర్ ఉండటంతో ఐపిఎల్ 2025 లో వివిధ జట్ల పర్‌ఫార్మెన్స్ గురించి, ఐపిఎల్‌లో ఏయే జట్లు ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే అంశాలపై, ఆటగాళ్ల పర్‌ఫార్మెన్స్‌పై చర్చలు నడుస్తున్నాయి. 'ది స్మాల్ కౌన్సిల్' అనే పేరుతో నడుస్తున్న ఈ డిబేట్ ఇటీవల వార్తల్లోకొచ్చింది.

ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్లో ఒక డిబెట్ నిర్వహించారు. ఆ డిబేట్‌లో పాల్గొన్న వారిలో ఒకరు మాట్లాడుతూ, చెన్నై బౌలర్ నూర్ అహ్మద్‌పై విమర్శలు చేశారు. అసలు ఐపిఎల్ 2025 మెగా వేలంలో చెన్నై జట్టు నూర్ అహ్మద్‌ను తీసుకోవాల్సిందే కాదని అన్నారు. ఆ వక్త చేసిన ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

వాస్తవానికి ఈ ఐపిఎల్ సీజన్‌లో ఎక్కువ వికెట్స్ తీసుకున్న ఆటగాళ్ల జాబితాలో ఈ ఆఫ్గనిస్తాన్ స్పిన్ బౌలర్ నూర్ అహ్మద్ ముందు వరుసలో ఉన్నాడు. ఆడిన 4 మ్యాచుల్లో నూర్ అహ్మెద్ 10 వికెట్స్ తీసుకున్నాడు. కానీ ఢిల్లీ మ్యాచ్‌లో మాత్రం అతడికి ఒక్కటే వికెట్ దక్కింది. ఒక్క మ్యాచ్‌లో ఎక్కువ వికెట్స్ తీసుకోనంత మాత్రాన్నే మిగతా బౌలర్లను వదిలేసి నూర్ అహ్మెద్‌ను ఎలా టార్గెట్ చేస్తారంటూ అశ్విన్ ఛానెల్ ప్రోగ్రాంపై విమర్శలు వెల్లువెత్తాయి. నూర్ అహ్మెద్ అభిమానులతో పాటు చెన్నై ఆటగాళ్ల తీరుపై విసిగిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు కూడా ఈ విషయంలో వక్త మాట్లాడిన తీరును తప్పుపట్టారు. సోషల్ మీడియాలో ఇదొక చర్చకు దారితీసింది.


తాజాగా ఈ వివాదంపై రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఐపిఎల్ మ్యాచ్‌ల ప్రివ్యూలను,రివ్యూలను విశ్లేషించడం తప్పించి ఎవ్వరినీ నిందించే ఆలోచన తమకు లేదన్నారు. ది స్మాల్ కౌన్సిల్ డిబేట్‌లో పాల్గొన్న విశ్లేషకులు చేసే వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఏదేమైనా ఇకపై చెన్నై సూపర్ కింగ్స్ ఆడే మ్యాచ్‌లపై విశ్లేషణలు పక్కకుపెట్టాలనుకుంటున్నట్లు చెబుతూ, ది స్మాల్ కౌన్సిల్ డిబేట్ షో అలాగే కొనసాగుతుందన్నారు. ఇదిలావుంటే, ఈ వివాదానికి కారణమైన వీడియోను అశ్విన్ యూట్యూబ్ ఛానెల్ నుండి తొలగించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News