KL Rahul: కాంతార సినిమా ఫోజ్.. వైరల్ అవుతున్న కేఎల్ రాహుల్ సెలబ్రేషన్!
KL Rahul: తన చుట్టూ గీసిన సర్కిల్, తనదైన స్టైల్‌లో చూపిన ఆత్మవిశ్వాసం, తన స్థానాన్ని గుర్తు చేయాలన్న తపన... ఇవన్నీ చూసిన వాళ్లకు "ఇది నా నేల, నా ఊరు, నా గర్వం" అనే సందేశమే అందింది.

KL Rahul: రిషబ్ శెట్టి, కేఎల్ రాహుల్.. ఒక్కరు సినిమాల్లో, ఇంకొక్కరు క్రికెట్‌లో తమ సత్తాను చూపిస్తున్నారు. ఈ ఇద్దరూ తమ మూలాలపై ఉన్న ప్రేమను ప్రపంచానికి చాటిన వారు. ఒకరు కన్నడ సినిమాకు ఒక గుర్తింపు తీసుకొస్తే.. మరొకరు బెంగళూరు గడ్డా.. నా అడ్డా అని నిరూపించాడు. రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతారా సినిమా ఎంత గ్రాండ్ సక్సెస్ కొట్టిందో అందరికి తెలుసు. ఇటు ఆర్సీబీపై మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ కాంతారా సీన్‌ను గుర్తుచేశాడు. కర్ణాటక సంస్కృతిని, గ్రామీణ జీవన శైలిని, భక్తి-భావాలను ఒకే చోట మేళవించిన కాంతారా సినిమా ప్రేక్షకుడి హృదయంలో అంతులేని ముద్ర వేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో రిషబ్ చేసిన నటన చూసినవారు ఎంతగానో మంత్రముగ్ధులయ్యారు. ఒక నటుడు పాత్రలో జీవించడమేంటో ఆయన చూపించాడు. తనలో దైవం ప్రవేశించినట్టు అతను నటించేటప్పుడు, తెరపై నటుడు ఉండకుండా ఒక శక్తి కనిపించిన అనుభూతి అందరికీ కలిగింది. అదే భావోద్వేగం ఇప్పుడు స్పోర్ట్స్‌లో, క్రికెట్‌లో కేఎల్ రాహుల్ రూపంలో కనిపించింది.
చిన్నతనంలో బెంగళూరులోనే ఎదిగిన రాహుల్‌కు ఆర్.సి.బి అంటే గౌరవం, అభిమానం, ఒక ప్రత్యేకమైన అనుబంధం. ఎప్పుడైనా ఆ జట్టులో ఆడాలని కలలుగన్నాడు. కానీ అతడిని తిరస్కరించారు. అతనికి అవకాశమే ఇవ్వలేదు. అలాంటి తిట్లు తినాల్సి వచ్చినప్పుడు, అలాంటి నిరసనం ఎదుర్కొన్నప్పుడు ఒక ఆటగాడిలో పుట్టే బాధను మాటల్లో చెప్పడం అసాధ్యం. కానీ రాహుల్ దాన్ని బాధగా కాకుండా స్ఫూర్తిగా మలచుకున్నాడు. ఇప్పుడు అతను ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతూ, తన మాతృభూమి గ్రౌండ్ అయిన చిన్నస్వామిలో తన టాలాంట్ చూపించాడు.
ఆ మ్యాచ్‌లో అతని సెలబ్రేషన్ పూర్తిగా భావోద్వేగంతో నిండి ఉంది. తన చుట్టూ గీసిన సర్కిల్, తనదైన స్టైల్‌లో చూపిన ఆత్మవిశ్వాసం, తన స్థానాన్ని గుర్తు చేయాలన్న తపన... ఇవన్నీ చూసిన వాళ్లకు "ఇది నా నేల, నా ఊరు, నా గర్వం" అనే సందేశమే అందింది. అది ఒక ఆటగాడిగా కాదు, ఒక గౌరవాన్ని నిలబెట్టే యువకుడిగా కనిపించింది.
ఇది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ కాదు. ఇది అతని వ్యక్తిత్వాన్ని చూపించిన వేదిక. ఇది అతనిని తక్కువ చేసిన వారికి ఇచ్చిన సమాధానం. ఇది అతను ఎక్కడి నుంచైనా ఎదగగలడని, తిరస్కరణ వచ్చినా తలవంచకుండా నిలబడగలడని నిరూపించుకున్న ఘడియ. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో అతను చేసిన సెలబ్రేషన్ వైరల్ అవుతోంది. కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి చేసిన ఆ క్లైమాక్స్‌ను పోల్చుతూ రాహుల్ ఇచ్చిన స్టిల్ తెగ వైరల్ అవుతోంది.