CSK vs KKR match: ధోనీ కేప్టేన్‌గా ఇరగదీస్తారనుకుంటే... చెత్త రికార్డు మూటగట్టుకున్నారు

CSK vs KKR match updates: మహేంద్ర సింగ్ ధోనీ జట్టు మరోసారి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. చాలాకాలం తరువాత ధోనీ కేప్టేన్‌గా ఆడుతున్న మ్యాచ్ కావడంతో శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌పై అభిమానులు ఆసక్తిని చూపించారు. కానీ వారి ఆసక్తిపై నీళ్లు చల్లుతూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి కేవలం 103 పరుగులు చేసింది.
ఇప్పటివరకు జరిగిన 18 ఐపిఎల్ సీజన్లలో చెన్నై సొంత గడ్డ చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ఆల్ టైమ్ లో స్కోర్ ఇదే.
తొలుత టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ముందు చెన్నై బ్యాటర్స్ ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయారు. ఓపెనర్స్ రచిన్ రవీంద్ర (4), డెవొన్ కాన్వె (12) పరుగులకే ఔట్ అవడంతోనే వారి పతనం మొదలైంది. విజయ్ శంకర్ (21 బంతుల్లో 29 పరుగులు), శివం దూబే (29 బంతుల్లో 31 పరుగులు) మినహాయిస్తే కనీసం ఆ స్కోర్ కూడా చేసిన ఆటగాళ్లు లేరు. రాహుల్ త్రిపాఠి 22 బంతుల్లో 16 పరుగులే చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ 1 పరుగుకే వెనుతిరిగాడు.
అప్పుడో ఇప్పుడో జట్టును ఆదుకునే రవింద్ర జడేజా కూడా సునిల్ నరైన్ బౌలింగ్‌లో 2 బంతులకే క్వింటన్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ఆ తరువాత వెంటనే దీపక్ హుడా కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు.
ఎప్పటిలానే చివర్లో బ్యాట్ పట్టుకున్న ధోనీ 1 పరుగుకే సునిల్ నరైన్ బౌలింగ్ ఎల్బీడబ్లూ అయ్యాడు. ఇలా చెన్నై బ్యాటర్స్ ఎంతసేపూ తమ వికెట్ కాపాడుకోవడానికే ప్రయత్నించారు కానీ ఏ ఒక్కరు కూడా దూకుడుగా ఆడలేకపోయారు. చెన్నై ఆటగాళ్లను అంత గొప్పగా కట్టడి చేయడంలో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్స్ భారీ సక్సెస్ అయ్యారు.
కోల్‌కతా బౌలర్లలో సునిల్ నరైన్ 3.25 ఎకానమితో అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ కనబర్చాడు. 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి కేవలం 13 పరుగులే ఇచ్చి అదుర్స్ అనిపించుకున్నాడు. మొత్తానికి చెన్నై జట్టు సొంత గడ్డపైనే ఈ అత్యల్ప స్కోర్‌తో ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది.