WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేత న్యూజిలాండ్
WTC Final: WTC ఫైనల్ తొలి టైటిల్ కేవసం చేసుకున్న న్యూజిలాండ్ * భారత్‌పై 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపు
WTC Final: ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. మొదటి రోజు మ్యాచ్ వర్షార్పణం.. ఆ తర్వాతి రోజు ఆకాశం నిండా మబ్బులు.. వెలుగు లేని కారణంగా మ్యాచ్‌కు కాసేపు విరామం.. అసలు మ్యాచ్ జరుగుతుందానే అనుమానం వచ్చింది. కానీ, ఆ తర్వాతి రోజు నుంచి జరిగింది. చివరకు రిజర్వ్ రూపంలో ఆటని కొనసాగించారు. సౌథాంప్టన్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ విజేతగా న్యూజిలాండ్ నిలిచింది. భారత్‌కు అనూహ్య ఓటమీ దక్కింది. కనీసం డ్రా కచ్చితమనుకున్న డబ్యుటీసీ ఫైనల్ పోరులో పరాజయం పాలయింది. న్యూజిలాండ్ కఠిన పేస్ సవాల్ ముందు కోహ్లీసేన చతికిలపడింది. టీమ్ ఇండియాను ఓడించి తొలిసారి నిర్వహిస్తున్న ఈ మెగా ట్రోఫీని న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో మరో 43 బంతులు మిగిలుండగానే ఎనిమిది వికెట్ల తేడాతో విలియమ్సన్ సేన విజయఢంకా మోగించింది. ఈ విజయంలో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ కీలక పాత్ర పోషించాడు. ఫస్ట్ ఇన్నింగులో ఇండియా 217 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ 249 పరుగులు చేసింది.
రెండో ఇన్నింగ్‌లో భారత బ్యాటింగ్ లైనప్ తడబడింది. రిషబ్ పంత్ మినహా.. మిగతా బ్యాట్స్ మెన్ అందరూ విఫలం అయ్యారు. దాంతో కోహ్లీ సేన వికెట్లన్నీ కోల్పోయి కేవలం 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. కవీస్ బౌలర్లలో టిమ్ సౌధీ 4, ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు తీయగా కైల్ జేమీసన్ రెండు, నీల్ వాగ్నర్ ఒకో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. 139 లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు మరో 43 బంతులు మిగిలుండగానే రెండు వికెట్లు కోల్సోయి 140 పరుగులు చేసింది. విలియమ్సన్ తో పాటు రాస్ టేలర్ న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఒకవైపు బ్యాట్స్ మెన్ తప్పిదాలు.. పిచ్ అనుకూలిస్తున్నా పేసర్లు స్థాయికి తగ్గట్లు సత్తాచాటలేకపోవడం.. ప్రణాళికలు అమలు చేయలేకపోవడం భారత్ ఓటమికి కారణాలయ్యాయి. భారత ఫేసర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. దాంతో పాటు వరుసగా క్యాచ్‌లు మిస్ చేయడం కూడా ఓటమికి ఒక కారణంగా కనిపించింది. ఆరంభంలోనే రాస్ టేలర్ ఇచ్చిన క్యాచ్‌ను పుజార నేలపాలు చేయడంతో పోటీలోకి వచ్చేందుకు భారత్‌కు మళ్లీ అవకాశమే దక్కలేదు. దాంతో మరింత రెచ్చిపోయి హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. టీమ్ విజయానికి దోహదపడ్డాడు.
అలవోక విజయాన్ని అందుకున్న కివీస్.. ఫస్ట్ ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ట్రోఫీని ముద్దాడింది. టెస్టు క్రికెట్‌లో ఈ ఛాంపియన్‌షిప్‌ని వరల్డ్‌కప్‌తో మాజీ క్రికెటర్లు పోలుస్తారు. అయితే.. క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్ ఇప్పటివరకు కనీసం ఒక్క వన్డే, టీ 20 ప్రపంచకప్‌ని కూడా గెలవలేదు. 2015, 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అనూహ్యంగా ఓడిపోయిన న్యూజిలాండ్ ఇన్నాళ్లకు.. ఐసీసీ ఈవెంట్‌లో విజేతగా నిలిచింది.