Mumbai Indians: పంజాబ్ పై ముంబై ప్రతీకారం.. రోహిత్ సేన ఖాతాలో అరుదైన రికార్డ్..!
* ఐపీఎల్ 2023 సీజన్ లో ముంబై ఇండియెన్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది.
Rohit Sena: ఐపీఎల్ 2023 సీజన్ లో ముంబై ఇండియెన్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. 200 పరుగులకు పైగా ఉన్న లక్ష్యాన్ని సునాయాసంగా చేధించి తన ఖాతాలో మరో విక్టరీని జమ చేసుకుంది. బుధవారం రాత్రి మొహాలీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియెన్స్ మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే నిర్దేశిత లక్ష్యాన్ని అందుకుంది. రోహిత్ శర్మ డకౌట్ తో వెనుదిరిగినా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ రెచ్చిపోయి ఆడడంతో 18.5 ఓవర్లలోనే 214 పరుగులు చేసింది.
తాజా విజయంతో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ జట్టు ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఏప్రిల్ 22న ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్ లో 215 పరుగుల లక్ష్య చేధనలో రోహిత్ సేన 13 పరుగులు తేడాతో పంజాబ్ చేతిలో ఓడిపోయింది. నాటి పరాభవానికి మొహాలీ స్టేడియంలో ముంబై ఇండియెన్స్ బదులు ఇచ్చినట్లు అవ్వగా తాజా విజయంతో రోహిత్ సేన ఖాతాలో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. వరుసగా రెండు మ్యాచుల్లో 200కి పైగా టార్గెట్ ను ఛేదించిన ఏకైక జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు క్రియేట్ చేసింది.
పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించి ముంబై ఇండియెన్స్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. వరుసగా రెండు ఓటములతో టోర్నీని ప్రారంభించిన రోహిత్ సేన అనంతరం హ్యాట్రిక్ విజయాలతో పాటు కఠినమైన రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ను మట్టికరిపించి ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇకపోతే, ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్ ను శనివారం ఆడనుంది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.