SRH vs RCB Preview: ఉత్సాహంతో బెంగళూరు; గెలవాలనే కసిలో హైదరాబాద్ టీం
IPL 2021 SRH vs RCB Preview: ఐపీఎల్ 2021 సీజన్ లో మొదటి మ్యాచ్ మినహా, మిగతావన్నీ.. చాలా థ్రిల్లింగ్ గా సాగుతున్నాయి.
IPL 2021 SRH vs RCB Preview: ఐపీఎల్ 2021 సీజన్ లో మొదటి మ్యాచ్ మినహా, మిగతా మ్యాచ్ లన్నీ.. చాలా థ్రిల్లింగ్ గా సాగుతున్నాయి. సీజన్ లో 6 వ మ్యాచ్ లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతోంది. మొదటి మ్యాచ్ లో గెలిచి ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది కోహ్లీ సేన. మరోవైపు మొదటి మ్యాచ్‌లో ఓడి, ఎలాగైన గెలవాలనే కసితో వార్నర్ సేన బరిలోకి దిగనుంది. ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉన్నారు. ఈ మ్యాచ్ కూడా అభిమానులకు పరుగుల విందును అందిస్తునడంలో సందేహం లేదు.
ఎప్పుడు: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB), ఏప్రిల్ 14, 2021, రాత్రి 7:30 గంటలకు
ఎక్కడ: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్ స్టేడియం), చెన్నై (MA Chidambaram Stadium, Chennai)
పిచ్: పిచ్ మరోసారి తేమతో కనిపిస్తోంది. చెపాక్ స్టేడియం పిచ్ టీంల అంచనాలకు విరుద్ధంగా ఉంటుంది. గత రెండు మ్యాచుల్లో 170 స్కోర్ యావరేజ్ గా నమోదైంది. టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకునేందుకే మొగ్గు చూపించొచ్చు.
గెలుపోటములు (Head To Head):
ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 18 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. హైదరాబాద్ టీమ్ 10 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 7 మ్యాచుల్లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. రికార్డు పరంగా చూస్తే హైదరాబాద్ టీం దే పైచేయిలా కనిపిస్తోంది. ఈ రెండు జట్లు ఐపీఎల్ 2020 లో చివరి సారి ఎలిమినేటర్ మ్యాచ్‌లో పోటీ పడ్డారు. అయితే ఈ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విలియమ్సన్ హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించాడు.
అత్యధిక స్కోర్లు:
ఐపీఎల్‌లో బెంగళూరుపై హైదరాబాద్ చేసిన అత్యధిక స్కోరు 231. ఇక హైదరాబాద్ టీంపై బెంగళూరు 227 పరుగుల అత్యధిక స్కోర్ ను నమోదు చేసింది.
టీంల విశ్లేషణ:
సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)
మిడిలార్డర్ పై భారం..
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తరఫున బెయిర్‌స్టో, మనీశ్ పాండే మినహా మిగతా వారు విఫలమయ్యారు. తొలి మ్యాచ్‌లో సరైన ఆరంభం లభించలేదు. సాహా, డేవిడ్ వార్నర్.. సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు. మిడిల్ ఆర్డర్ లో బెయిర్‌స్టో ఒక్కడే కనిపిస్తున్నాడు. విజయ్ శంకర్, మహ్మద్ నబీ నిలకడలేమి జట్టుకు ఇబ్బందిగా మారింది. ఇక ఊరటనిచ్చే అంశం ఏమిటంటే..యువ హిట్టర్ అబ్దుల్ సమద్ ఈజీగా సిక్సర్లు బాదడం.
కాగా, విలియమ్సన్ ఇంకా మ్యాచ్ ఫిట్‌నెస్‌ను సాధించలేదని కోచ్ బేలిస్ తెలిపాడు. దీంతో అతడు ఈ మ్యాచ్‌కూ దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయితే వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ రూపంలో హైదరాబాద్‌కు ఊరట లభించనుంది. అతడు తన తప్పనిసరి క్వారంటైన్ ముగించుకోవడంతో... బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో నబీ స్థానంలో బరిలో దిగే అవకాశం ఉంది.
బలంగానే బౌలింగ్ విభాగం..
ఇక బౌలింగ్‌లో మాత్రం రషీద్ ఖాన్, మహ్మద్ నబీ చెపాక్ ఆకట్టుకుంటున్నారు. భువీ, సందీప్ శర్మ మొదటి మ్యాచ్ లో ధారాళంగా పరుగులిచ్చారు. నటరాజన్ కూడా బాగానే కట్టడి చేస్తున్నాడు. ఓవరాల్‌గా హైదరాబాద్ బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)
మిడిలార్డర్ లో ఆదుకునేదెవరో..
మరోవైపు సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ముంబైను ఓడించడం ద్వారా బెంగళూరు టీమ్ ఆత్మవిశ్వాసంతో ఉంది. గత మ్యాచ్‌కు దూరమైన దేవ్‌దత్ పడిక్కల్ ఈ మ్యాచ్‌లో రజత్ పటిదార్ స్థానంలో బరిలోకి దిగొచ్చు. బెంగళూరు జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, పవర్ హిట్టర్లు గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ బాగానే ఆడారు. కానీ.. ఓపెనర్ వాషింగ్టన్ సుందర్, మూడో డౌన్ లో ఆడిన పాటిదార్ విఫలమయ్యారు. ఆల్‌రౌండర్‌గా డేనియల్ క్రిస్టియన్ కూడా విఫలమయ్యాడు. దీంతో లోయర్ మిడిలార్డర్ బలహీనంగా తయారైంది.
ధారాళంగా పరుగులు..
బౌలింగ్‌లోనూ చాహల్ మొదటి మ్యాచ్‌లోనే 4 ఓవర్లలో 41 పరుగులు సమర్పించుకున్నాడు. సిరాజ్ పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ మాత్రం తీయలేకపోయాడు. అయితే.. జెమీషన్ మాత్రం పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ కూడా తీశాడు. ఇదొక్కటే వారికి కొంత రిలీఫ్‌నిచ్చే అంశం. ఫీల్డింగ్‌లోనూ రాణించాల్సి ఉంది. మొదటి మ్యాచ్ లో కొన్ని తప్పిదాలు జరిగాయి.