PBKS vs KKR: కోల్‌కతా లక్ష్యం 124; బౌలర్ల ధాటికి కుప్పకూలిన పంజాబ్

IPL 2021: కోల్‌కతా తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ టీం 20 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేసింది.

Update: 2021-04-26 15:55 GMT

వికెట్లు సాధించిన ఆనందంలో కోల్‌కతా బౌలర్లు (ఫొటో ట్విట్టర్)

IPL 2021, PBKS vs KKR: అహ్మాదాబాద్ లో ఐపీఎల్ 2021లో భాగంగా కోల్‌కతా తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ టీం 20 ఓవర్లతో 9వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేసింది. దీంతో కో‌ల్‌కతా లక్ష్యం 124 పరుగులుగా మారింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆరంభించింది. 4 ఓవర్ల వరకు కుదురుగా ఆడి.. ఇక జోరు పెంచుతారనుకున్న సమయంలో పంజాబ్ టీం రాహుల్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. 19 పరుగులు చేసిన రాహుల్‌ పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి నరైన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

అనంతరం బ్యాటింగ్ వచ్చిన గేల్ కూడా విఫలమయ్యాడు. పవర్‌ హిట్టర్‌ క్రిస్‌ గేల్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. శివమ్‌ మావి వేసిన ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌ మూడో బంతిని ఆడే ప్రయత్నంలో గేల్‌ బ్యాట్‌ను తాకుతూ కీపర్‌ చేతుల్లో పడింది. ఇక వరుసగా వికెట్లు కోల్పోతూ.. పీకల్లోతూ కష్టాల్లో కూరకపోయింది పంజాబ్ టీం.

వికెట్లు పడుతున్నా... మయాంక్ అగర్వాల్ ధాటిగానే ఆడాడు. 1 పరుగు చేసిన దీపక్‌ హుడా ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో మోర్గాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డ పంజాబ్‌ ఇన్నింగ్స్‌కు మయాంక్‌, పూరన్‌లు నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ, నరైన్ మాత్రం ఈ జోడీని విడదీశాడు. 11.2 ఓవర్లో మయాంక్ (31 పరుగులు, 34 బంతులు, 1ఫోర్, 2 సిక్సులు) త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్స్ ఒక్కరు కూడా రాణించలేదు. పూరన్ 19, నికోలస్ 2, షారుఖ్ 13, రవి 1 విఫలమయ్యారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో మయాంక్ 31, జోర్దాన్ 30 పరుగులు చేశారు. మరే ఇతర బ్యాట్స్‌మెన్ 20 పరుగులు కూడా దాటలేదు. కోల్‌కతా బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో పంజాబ్ ను కోలుకోనివ్వకుండా.. తక్కువ పరుగులకే పరిమితం చేశారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో ప్రసీద్ 3 వికెట్లు, పాట్ కుమిన్స్, నరైన్ చెరో 2 వికెట్లు, మావి, చక్రవర్తి చెరో వికెట్ తీశారు.

Tags:    

Similar News