IPL 2021: నేటి నుంచి ఐపీఎల్ 14 సందడి - ఆల్‌టైం రికార్డ్స్; బోణి కొట్టేదెవరో..
IPL 2021: తొలి మ్యాచ్‌లో ముంబైతో బెంగళూరు ఢీ
IPL 2021: ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లాడిపోతోంది. మరోవైపు నేటి నుంచి ఐపీఎల్ 14 సీజన్ సందడి మొదలుకానుంది. ఇన్నాళ్లు కరోనా భయంతో మ్యాచ్‌లు నిర్వహించడం అసాధ్యంగానే కనిపించినా... అన్ని అడ్డంకులను దాటుకుని ఐపీఎల్ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది. ఈ సీజన్ కు సంబంధించిన కొన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం..
కేవలం టీవీల్లోనే..
కోవిడ్-19తో ప్రత్యక్షంగా మ్యాచ్‌లను చూసేందుకు అనుమతి లేదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా టీవీలలోనే ఈ మజాను ఆస్వాదించాలి. కరోనా వెంటాడుతున్నా.. యూఏఈలో లాగే సక్సెస్ ఫుల్ గా టోర్నీ నిర్వహించగలమన్న ఆశాభావంతో బీసీసీఐ ఉంది. ఈ ఏడాదే భారత్‌లో టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ లీగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.
తొలి పంచ్ ఎవరిదో..
చెన్నైలో జరిగే తొలి మ్యాచ్ లో రోహిత్ సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తో విరాట్ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీపడనున్నాయి. తొలి మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగనుంది. ఇరు జట్లలో భారీ హిట్టర్లు తమ సత్తాను చాటేందుకు రెడీ గా ఉన్నారు. ఈ మ్యాచ్ ఈ రోజు సాయంత్రం గం.7:30నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో అన్ని మ్యాచ్‌లు అరగంట ముందే ప్రారంభం కానున్నాయి.
ఆరు వేదికల్లోనే..
కరోనా నేపథ్యంలో కేవలం ఆరు వేదికల్లోనే ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. చెన్నై, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. క్వాలిఫయర్స్, ఎలిమినేటర్, ఫైనల్‌కు అహ్మదాబాద్ వేదికగా జరగుతాయి.
తొలి మ్యాచ్‌లో సత్తా చాటాలని..
ఐపీఎల్ సీజన్ 14 లో అరంగేట్రం చేసిన ఆటగాళ్లకు చాలా ప్రత్యేకం. తొలి అడుగులోనే బలమైన ముద్ర వేయాలనే పట్టుదలతో ఉన్నారు. వారిలో సచిన్ కుమారుడు అర్జున్ తెందుల్కర్ (ముంబయి) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. షారుక్ ఖాన్ (పంజాబ్ కింగ్స్), మహమ్మద్ అజహరుద్దీన్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నారు.
ఐపీఎల్ -14 సీజన్ విశేషాలు
జట్లు - 8
మ్యాచ్‌లు - 60
వేదికలు - 6
ఫైనల్ మ్యాచ్ - మే 30
ఐపీఎల్ ఆల్‌టైం రికార్డ్స్
పరుగులు - విరాట్ కోహ్లీ (5878)
సిక్సర్లు - క్రిస్‌గేల్ (349)
ఇన్నింగ్స్‌లో సిక్సర్లు - క్రిస్‌గేల్ (17)
వ్యక్తిగత స్కోరు - క్రిస్‌గేల్ (175)
స్ట్రైక్‌రేట్ - ఆండ్రీ రసెల్ (183.33)
హాఫ్ సెంచరీలు - డేవిడ్ వార్నర్ (48)
ఫోర్లు - శిఖర్ ధావన్ (591)
ఫాస్టెస్ట్ సెంచరీ - క్రిస్‌గేల్ (30 బంతుల్లో)
ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ - కేఎల్ రాహుల్ (14 బంతుల్లో)
వికెట్లు - లసిత్ మలింగ (170)
బౌలింగ్ - అల్జారి జోసెఫ్ (6/12)
సగటు - కగిసో రబాడ (18.09)
ఎకానమీ - రషీద్ ఖాన్ (6.24)
చెత్త బౌలింగ్ - బాసిల్ థంపి (0/70)
డాట్ బాల్స్ - హర్భజన్ సింగ్ (1249)