IPL 2021, DC vs RCB Match 22 Preview: సమఉజ్జీల పోరులో గెలిచేదెవరో?
DC vs RCB Match 22 Preview: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో బెంగళూరు తలపడుతోంది.
DC vs RCB Match 22 Preview: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో బెంగళూరు తలపడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి 7.30 గంటలకి ఈ మ్యాచ్ జరగనుంది.
వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. అనూహ్యంగా ఐదో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గత ఆదివారం చెపాక్‌లో సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ బౌలింగ్‌తో క్లిష్టంగా మార్చుకుని.. ఆఖరికి సూపర్‌లో గెలిచి ఊపిరి పీల్చుకుంది.
హెడ్ టూ హెడ్
ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 25 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో బెంగళూరు టీమ్ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 10 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మిగిలిన ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. హైస్కోర్ విషయానికి వస్తే... ఢిల్లీపై ఇప్పటి వరకూ బెంగళూరు చేసిన అత్యధిక స్కోరు 215 పరుగులు. అలాగే బెంగళూరుపై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 196 పరుగులు మాత్రమే.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
బెంగళూరు టీమ్‌లో ఓపెనర్ దేవదత్ పడిక్కల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఫాంలో ఉన్నారు. ఇక గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ బాగానే రాణిస్తున్నారు. కానీ, చెన్నై మ్యాచ్ లో వీరు బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ఇక వాషింగ్టన్ సుందర్, డేనియల్ క్రిస్టియాన్ ఆల్‌రౌండర్ పాత్రను సరిగ్గా పోషించలేకపోతున్నారు. మొత్తంగా.. కోహ్లీ, పడిక్కల్, మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ ప్రదర్శనపైనే బెంగళూరు అతిగా ఆధారపడుతోంది. ఆ జట్టు గెలవాలంటే.. ఈ నలుగురిలో కనీసం ఇద్దరు నిలబడాల్సి వస్తోంది.
ఇక బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ ఆరంభంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెడుతున్నాడు. కానీ, వికెట్లు ఎక్కువగా తీయలేక పోతున్నాడు. అతనికి జోడీగా నవదీప్ సైనీ గత మ్యాచ్‌లో అంచనాల్ని అందుకోలేకపోయాడు. ఇక స్పిన్నర్లు చాహల్, వాషింగ్టన్ సుందర్ కాస్త పొదుపుగానే బౌలింగ్ చేస్తున్నా.. వికెట్లు తీయలేకపోగా మ్యాచ్‌లను మలుపు తిప్పేలా బౌలింగ్ చేయడం లేదు. హర్షల్ పటేల్.. గత మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో జడేజా దెబ్బకి ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు. మరి ఈ మ్యాచ్ లో ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి.
ఢిల్లీ టీమ్‌కి యువ ఓపెనర్ పృథ్వీ షా మంచి ఆరంభాన్ని ఇస్తున్నాడు. పవర్‌ప్లేలో అలవోకగా బౌండరీలు రాబడుతున్నాడు. గత మ్యాచ్‌లో హైదరాబాద్‌పై హాఫ్ సెంచరీతో మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఇక మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. మిడిలార్డర్ బలహీనత ఢిల్లీ టీంను వెంటాడుతోంది. స్టీవ్‌స్మిత్, సిమ్రాన్ హిట్‌మెయర్, మార్కస్ స్టాయినిస్ ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం కాస్త ఫినిషర్ రోల్‌ని పోషిస్తున్నాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చేరికతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతంగా మారింది.
బౌలింగ్‌లో పేసర్ అవేష్ ఖాన్ ప్రతి మ్యాచ్‌లోనూ కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతున్నాడు. మరో బౌలర్ కగిసో రబాడ మాత్రం చివర్లో ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు. ఇక స్పిన్నర్ అమిత్ మిశ్రాకి జోడీగా ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ చేరాడు. దీంతో మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థులను రన్స్ చేయకుండా అడ్డుకోవడంలో ఈ జోడీ సహాయపడుతోంది.
ప్లేయింగ్ లెవన్(అంచనా)
ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా(కెప్టెన్, కీపర్), స్టీవెన్ స్మిత్, రిషబ్ పంత్ షిమ్రాన్ హెట్మియర్, మార్కస్ స్టోయినిస్, లలిత్ యాదవ్, అక్సర్ పటేల్, కగిసో రబాడా, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: దేవదత్ పాడికల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), షాబాజ్ అహ్మద్ / రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్(కీపర్), వాషింగ్టన్ సుందర్, డాన్ క్రిస్టియన్ / డేనియల్ సామ్స్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్