IPL 2020: ముంబై బౌలర్ల ధాటికి చెన్నై చిత్తు.. చెత్త రికార్డును మూటగట్టుకున్న సీఎస్‌కే
IPL 2020: ఐపీఎల్ 2020లో వరుస పరాజయాలతో ఢీలా పడ్డ చెన్నై సూపర్ కింగ్స్.. ఏ దశలోనూ తెరుకోలేదు. తన కథను మార్చుకోలేదు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బౌలర్ల ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు
IPL 2020: ఐపీఎల్ 2020లో వరుస పరాజయాలతో ఢీలా పడ్డ చెన్నై సూపర్ కింగ్స్.. ఏ దశలోనూ తెరుకోలేదు. తన కథను మార్చుకోలేదు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బౌలర్ల ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఆ జట్టు టాపార్డర్ అదే తడబాటును కొనసాగిస్తూ విఫలమైంది. తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. 20 ఓవర్లు ఆడి 114/9 పరుగులకే పరిమితమైంది. సామ్ కరన్ (52; 47 బంతుల్లో 4×4, 2×6) ఒక్కడే చివరి వరకు పోరాడాడు. జట్టు చెప్పుకోదగ్గ స్కోర్ చేయాడానికి కారణమయ్యాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబయి ప్రత్యర్థిని ఆదిలోనే ఘోరంగా దెబ్బకొట్టింది. భారీ మార్పులతో బరిలోకి దిగిన ధోనీసేనకు ముంబాయి బౌలర్లు చుక్కలు చూపించారు. తొలి ఓవర్ నుంచే వికెట్లు పడగొడుతూ చెన్నై పతానాన్నిశాసించారు. ట్రెంట్ బౌల్ట్ మంచి పేస్‌తో బౌలింగ్ చేసి కేవలం 18 పరుగులు ఇచ్చి కీలకమైన 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా బంతితో మ్యాజిక్ చేసి ఒకే ఓవర్‌లో వరుసగా రెండు వికెట్లను తీసుకున్నాడు. (2/25), రాహుల్ చాహర్ కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కట్టుదిట్టమైన బంతులతో వణికించారు.
ఖాతా తెరవక ముందే ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ (0; 5 బంతుల్లో)ను బౌల్ట్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రెండో ఓవర్లో అంబటి రాయుడు (2; 3 బంతుల్లో), ఎన్.జగదీశన్ (0)ను బుమ్రా వరుస బంతుల్లో ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ (1; 7 బంతుల్లో)ను బౌల్ట్ బోల్తా కొట్టించడంతో చెన్నై 3 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ (16), జడేజా (7)లు కూడా కుదరుకోలేకపోయారు. దీంతో చెన్నై ఇన్నింగ్స్ 50 పరుగుల్లోపే ముగుస్తుందని అందరూ భావించారు. అయితే, శామ్ కరన్ ఒంటరి పోరాటంతో చెన్నై 114 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
ఈ క్రమంలో చెన్నై చెత్త రికార్డును సీఎస్‌కే మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే పవర్ ప్లేలో ఐదు వికెట్లు కోల్పోవడం ఇదే ప్రథమం. దాంతో చెన్నై మరో అప్రతిష్టను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవడం కూడా ఇదే తొలిసారి.