Ind vs Eng 1st Test: తొలిరోజు ఆటలో ఇంగ్లండ్ పై టీమిండియాదే పైచేయి
Ind vs Eng 1st Test: తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌట్
Ind vs Eng 1st Test: టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టులో మొదటి రోజు ఆటలో టీమిండియాదే పైచేయిగా నిలిచింది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లతో ఇంగ్లండ్ పనిబట్టారు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సైతం రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ ను దెబ్బతీశాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ బెన్ స్టోక్స్ 70 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే బుమ్రా విసిరిన ఓ అద్భుతమైన బంతికి స్టోక్స్ కళ్లు చెదిరాయి. బంతి ఎటు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో స్టోక్స్ వికెట్లను పూర్తిగా వదిలేయగా, బంతి మిడిల్ వికెట్ ను తాకింది. ఇంగ్లండ్ జట్టులో ఓపెనర్లు డకెట్ 35, క్రాలే 20, జో రూట్ 29, జానీ బెయిర్ స్టో 37, టామ్ హార్ట్ లే 23 పరుగులు చేశారు.
ఇక, తొలి రోజు ఆట చివరి సెషన్ లో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ జోడీ శుభారంభం అందించింది. వీరిద్దరూ తొలి వికెట్ కు 80 పరుగులు జోడించారు. 24 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మరో ఎండ్ లో యశస్వి జైస్వాల్ 76 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 70 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 9 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. అతడికి తోడుగా శుభ్ మాన్ గిల్ 14 పరుగులతో ఆడుతున్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు టీమిండియా ఇంకా 127 పరుగులు వెనుకబడి ఉంది.