రేపు ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్
PAK vs IND: ఇండియా, పాక్ మ్యాచ్‌ఫై సర్వత్రా ఆసక్తి
PAK vs IND: భారత క్రికెట్ ఫ్యాన్స్ ఆదివారం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆసియా కప్ 2022 లో భారత్ మరోసారి పాకిస్థాన్ ను ఢీ కొట్టనుంది. ఏడురోజుల తేడాతో రెండో సారి ఇరుజట్లు తలపడనున్నాయి. దీంతో ఇరు జట్ల అభిమానులతో సహా ప్రపంచ క్రికెట్ మరోసారి అద్భుతమైన మ్యాచ్ ను దర్శించనున్నారు. భారత్, పాక్ దేశాల మధ్య పోటీ అంటే ఇరు జట్టు క్రీడాకారులు హోరాహోరీన తలపడతారు. పాకిస్థాన్ చివరి మ్యాచ్‌లో హాంకాంగ్‌ను ఓడించి సూపర్-ఫోర్ రౌండ్‌లోకి ప్రవేశించింది. దీంతో సెప్టెంబర్ 4 ఆదివారం రోజున భారతదేశం .. పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి.
హాంకాంగ్‌పై పాకిస్తాన్ విజయం సాధించడంతో.. టోర్నమెంట్‌లోని సూపర్-ఫోర్ లో అడుగు పెట్టింది. మొదట, గ్రూప్ బిలో శ్రీలంక , బంగ్లాదేశ్‌లను ఓడించి ఆఫ్ఘనిస్తాన్ తమ బెర్త్ ను ఖాయం చేసుకుంది. గ్రూప్-ఎ నుంచి పాకిస్థాన్, హాంకాంగ్‌లను ఓడించి భారత్ మొదటగా గ్రూప్ -4 లో అడుగు పెట్టింది. గ్రూప్ B నుండి, శ్రీలంక డూ ఆర్ డై మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. గ్రూప్ బి లో సూపర్ ఫోర్ లో ఆఫ్ఘనిస్తాన్ తో శ్రీలంక తలపడనుంది.
సూపర్-ఫోర్ మ్యాచ్‌లు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. మొదటి మ్యాచ్‌లో శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్ ఢీకొంటుంది. గ్రూప్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకను సులభంగా ఓడించింది. అయితే భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగే మ్యాచ్ కోసమే ఎక్కువ మందిక్రీడాభిమానులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇరుదేశాల మధ్య ఏర్పడిన సంక్షోభంతో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. దీంతో భారత్, పాక్ లు ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం చాలా అరుదు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.