టీమిండియా ఆస్ట్రేలియా టూర్‌లో జాతి వివక్ష వివాదం రేగింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో భారత క్రికెటర్లు జాతి వివక్ష కామెంట్లు ఎదుర్కొన్నారు. పీల్డ్‌లో ఉన్న బుమ్రా, సిరాజ్‌లపై స్టేడియంలో కొందరు అనుచిత కామెంట్లు చేశారు. దీనిపై కెప్టెన్ రహానె అంపైర్లను ఆశ్రయించగా ఘటనపై మండిపడ్డ బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరింది.
భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడవ టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. మూడో రోజు ఆట ముగిసే సమయంలో కెప్టెన్ అజింక్యా రహానే, సీనియర్ ప్లేయర్లు ఈ విషయంపై అంపైర్లకు ఫిర్యాదు చేశారు.
టీమిండియా ఫిర్యాదుతో క్రికెటర్లను ఎవరు కామెంట్ చేశారనే అంశంపై అంపైర్లు సెక్యూరిటీ అధికారులు చర్చించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందిస్తామని అధికారులు చెప్పారు. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఐసీసీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.