సిరీస్ భాగ్యం ఎవరికో?.. నిర్ణయాత్మక పోరుకు ఉప్పల్ సిద్ధం..
India vs Australia 3rd T20: భారత గడ్డపై టీ20 సిరీస్ రసవత్తరంగా సాగుతోంది.
India vs Australia 3rd T20: భారత గడ్డపై టీ20 సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో ఆసీస్ గెలిస్తే.. రెండో ఫైట్‌లో టీమిండియా గెలుపొందింది. దీంతో మూడో టీ20పై ఉత్కంఠ నెలకొంది. మూడు టీ20ల సిరీస్ చివరి దశకు చేరుకుంది. ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. మూడు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో ఉప్పల్ మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది. ఇందులో ఏ జట్టు గెలుస్తుందో ఆ టీమ్‌కు సిరీస్ దగ్గనుంది. ఈ క్రమంలోనే మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
ప్రస్తుతం అన్ని విభాగాల్లో ఇరు జట్లు బలంగా ఉన్నాయి. బౌలింగ్, ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకుంటే టీమిండియాకే సిరీస్ వచ్చే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తొలి మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేసినా.. బౌలింగ్, ఫీల్డింగ్‌తో ఓటమి మూటగట్టుకుంది. అయితే రెండో మ్యాచ్‌లో భారత్ పుంజుకుని మ్యాచ్ గెలిచింది. అటు పర్యాటక జట్టు ఆసీస్ కూడా బౌలింగ్ లోపాలతో సతమతమవుతోంది.
ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత నడుమ ప్రత్యేక బస్సులో ఇరు జట్ల ఆటగాళ్లు హోటల్‌కు చేరుకున్నారు. మ్యాచ్‌లో భాగంగా ఇవాళ ప్రాక్టీస్ చేయనున్నారు. ఇక మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. మరోవైపు స్టేడియం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.