Tokyo Olympics 2020: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా..వందేళ్లకు అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకం
Tokyo Olympics 2020 - Neeraj Chopra: భారత యంగ్ ప్లేయర్ నీరజ్ చోప్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అఖండ భారతావనిని ఆనందంలో ముంచెత్తాడు. ఏకంగా వందేళ్ల కలను నిజం చేశాడు. అథ్లెటిక్స్‌లో శతాబ్దం తర్వాత తొలి పతకం అందించాడు. జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. స్వత్రంత్ర భారత దేశంలో వ్యక్తిగత క్రీడల్లో అభినవ్ బింద్రా తర్వాత గోల్డ్ మెడల్ అందుకున్న వీరుడిగా నిలిచాడు.
అందరూ ఊహిస్తున్నట్టుగానే నీరజ్ చోప్రా అద్భుతం చేశాడు. ఈటెను విసరడంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాడు. మహామహులు అనుభవజ్ఞులు పతకాలకు ఫేవరెట్లను వెనక్కి నెట్టాడు. భారత కీర్తిపతాకను అత్యున్నత శిఖరాలలో రెపరెపలాడించేలా చేశాడు. అందరికన్నా మెరుగ్గా ఆడుతూ ఈటెను 87.58 మీటర్లు విసిరి నయా చరిత్రను సృష్టించాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం దక్కింది. జావెలిన్ త్రో ఫైనల్స్‌లో అద్భత ప్రదర్శన చేసిన నీరజ్ చోప్రా చివరి వరకూ టాప్‌లో నిలిచి స్వర్ణ పతకం సాధించాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఏడుకు చేరింది. కాగా తొలి ప్రయత్నంలోనే 87.03 మీటర్లు విసిరి టాప్‌లో నిలిచిన నీరజ్ రెండో రౌండ్‌లోనూ 87.58 మీటర్లు విసిరి టాప్‌లో నిలిచాడు. ఆట చివరి వరకూ ఇదే దూకుడు కొనసాగించిన నీరజ్ భారత్ స్వర్ణ పతకం కలను నెరవేర్చాడు.
మరోవైపు టోక్యో ఒలింపిక్స్ లో ఇవాళ ఒక్కరోజే భారత్ ను రెండు పతకాలు వరించాయి. నిమిషాల వ్యవధిలోనే భజరంగ్ పునియా, నీరజ్ చోప్రాలు భారత్ కు పతకాలు అందించారు. రెజ్లింగ్ లో భజరంగ్ పునియా ఉడుంపట్టుతో కాంస్య పతకం సాధించగా జావెలిన్ త్రోలో నీరజ్ చెలరేగి పతకం అందించాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్ లో భారత పతకాల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటి వరకూ ఒలింపిక్స్ లో భారత అత్యధిక పతకాల సంఖ్య ఆరు కాగా టోక్యో ఒలింపిక్స్ లో ఏడు పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించినట్లైయింది.