INDW vs ENGW 2021: ఏడేళ్ల తర్వాత బరిలోకి మిథాలీ సేన

INDW vs ENGW 2021: నేడు ఇంగ్లండ్ మహిళలతో భారత మహిళల టీం ఏకైక టెస్టులో తలపడేందుకు సిద్ధమైంది.

Update: 2021-06-16 09:18 GMT

Test Match Between India and England Womens Teams Today

INDW vs ENGW 2021: ఏడేళ్ల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్‌ జట్టు టెస్టు మ్యాచ్‌ ఆడబోతోంది. బుధవారం నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడుతుంది. ఇంగ్లండ్ లో ఓవైపు శుక్రవారం నుంచి జరిగే ప్రతిష్టాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో టీమిండియా, న్యూజిలాండ్‌ మెన్స్‌ టీంలు తలపడనున్నాయి. మరోవైపు నేటి (బుధవారం) నుంచి ఇంగ్లండ్ మహిళలతో భారత మహిళల టీం ఏకైక టెస్టులో తలపడేందుకు సిద్ధమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ టెస్టు మ్యాచ్‌ కోసం భారత మహిళలు ఆత్మ స్థైర్యంతో బరిలోకి దిగనున్నారు.

2014 నుంచి భారత్ టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. ఇంత గ్యాప్‌ తరువాత బరిలోకి దిగనుండడంతో మిథాలీ సేన ఎలా ఆడబోతుందనే ఆసక్తి నెలకొంది. బ్రిస్టల్‌లో బుధవారం నుంచి ప్రారభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు మిథాలీ సేన సర్వశక్తులను ఒడ్డేందుకు సిద్ధమైంది. ఈమ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇంతకుముందు భారత మహిళలు ఆడిన మూడు టెస్టుల్లోనూ విజయం సాధించారు.

ఈ టెస్టు మ్యాచ్‌లో భారత మహిళలు గెలిస్తే.. నాలుగో విజయంతో చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. మరోవైపు ఈ మధ్య ఇంగ్లండ్ ఆడిన మూడు టెస్టుల్లో పై చేయి సాధించింది. దీంతో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగనుందనడంలో సందేహం లేదు. దాదాపు ఏడేళ్ల తరువాత మిథాలీ సేన బరిలోకి దిగుతున్నా.. చివరిగా ఆడిన మూడు టెస్టుల్లో విజయం సాధించింది. ఈ మూడు విజయాల్లో రెండు ఇంగ్లండ్‌పైన ఇంగ్లండ్‌లోనే సాధించడం విశేషం.

భారత మహిళలు: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, పునం రౌత్, ప్రియా పునియా, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, షఫాలి వర్మ, స్నేహ రానా, తానియా భాటియా, ఇంద్రాణి రాయ్, జులన్‌ గోస్వామి, పూజ వస్త్రకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్ట్, రాధా యాదవ్. ఇంగ్లండ్ మహిళలు: హీథర్ నైట్ (కెప్టెన్), ఎమిలీ అర్లోట్, టామీ బ్యూమాంట్, కేథరీన్ బ్రంట్, కేట్ క్రాస్, సోఫియా డంక్లే, సోఫీ ఎక్లెస్టోన్, జార్జియా ఎల్విస్, నటాషా ఫర్రాంట్, అమీ జోన్స్, నటాలీ సైవర్, అన్య ష్రబ్‌సోల్, మాడి విల్లియర్స్, ఫ్రాన్ విల్సన్ , లారెన్ విన్ఫీల్డ్-హిల్

ఈ ఏకైక టెస్టు మ్యాచ్ కోసం 18 మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కాగా, ఇందులో 8 మందికి మాత్రమే గతంలో టెస్టులు ఆడిన అనుభవం ఉంది. అయితే అంతా కలిపి కేవలం 30 మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. ఈ మేరకు టీమిండియా చూపు సీనియర్లవైపు ఉంది. ఇంగ్లండ్‌ టెస్టు జట్టులో15 మందిలో 11 మంది అనుభవజ్ఞులే ఉన్నారు. వీరంతా కలిసి 47 టెస్టు మ్యాచ్‌లు ఆడి మంచి ఫామ్‌లో ఉన్నారు. గత మూడు టెస్టుల్లో ఉన్నవారే ప్రస్తుత జట్టుతో బరిలోకి దిగనున్నారు. అందుకే ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆశక్తి నెలకొంది.

Tags:    

Similar News