2021లో ఎనిమిదో విజయం.. అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో భారత్.. కెప్టెన్‌గా కోహ్లీ అరుదైన రికార్డు..!
India vs South Africa: ఈ మ్యాచ్‌లో విజయంతో పాటు విరాట్ కోహ్లి అండ్ కంపెనీ ఎన్నో భారీ రికార్డులను బ్రేక్ చేసింది...
India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయంతో పాటు విరాట్ కోహ్లి అండ్ కంపెనీ ఎన్నో భారీ రికార్డులను బ్రేక్ చేసింది. భారత జట్టు పాకిస్థాన్ నెలకొల్పిన ఓ రికార్డును కొల్లగొట్టింది.
ఈ ఏడాది అత్యంత విజయవంతమైన టెస్టు జట్టుగా
అవతరించిన భారత్, 2021లో 8వ టెస్టు విజయాన్ని సాధించింది. దీంతో ఈ ఏడాది అత్యంత విజయవంతమైన టెస్టు జట్టుగా టీమిండియా అవతరించింది. ఈ టెస్టుకు ముందు భారత్, పాకిస్థాన్‌లు తలో 7 మ్యాచ్‌ల్లో గెలిచి టైగా నిలిచాయి. ఇంగ్లండ్ ఖాతాలో నాలుగు విజయాలు ఉన్నాయి.
అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లి..
విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాలో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన భారతీయ కెప్టెన్‌గా నిలిచాడు. ఆఫ్రికన్ గడ్డపై ఇప్పటివరకు మొత్తం 4 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ, రెండింట్లో విజయాలు నమోదు చేయగలిగాడు. రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో 2006లో సౌతాఫ్రికాలో ఒక టెస్టు, 2010లో ఎంఎస్ ధోనీ నేతృత్వంలో టీమ్ ఇండియా ఒక టెస్టు గెలిచింది. అలాగే వరుసగా రెండు బాక్సింగ్ డే టెస్టులు గెలిచిన ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
అదే సమయంలో దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియాకు ఇది నాలుగో విజయం. దీంతో ఆఫ్రికా గడ్డపై నాలుగు టెస్టులు గెలిచిన తొలి ఆసియా దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఐసీసీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 64.28 విజయాల శాతంతో 54 పాయింట్లతో డబ్యూటీసీలో టీమ్ ఇండియా నాలుగో స్థానంలో ఉంది. అదే సమయంలో, ఆఫ్రికన్ జట్టు పాయింట్లు లేకుండా 8వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం 100 విజయ శాతంతో 36 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.