India vs England: ఉప్పల్‌ గడ్డ.. టీమిండియా అడ్డా..

India vs England: టీమిండియాకు పెట్టని కోట రాజీవ్‌‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం

Update: 2024-01-24 14:45 GMT

India vs England: ఉప్పల్‌ గడ్డ.. టీమిండియా అడ్డా.. 

India vs England: ఓవైపు బజ్‌బాల్‌ ఆట తీరుతో టెస్టుల్లో దూసుకెళుతోన్న ఇంగ్లాండ్‌... మరోవైపు సాంప్రదాయ ఫార్మాట్‌లో తనదైన ఆటతో సాగిపోతున్న టీమిండియా... ఇక సొంత గడ్డపై భారత్‌కు తిరుగే లేదు. ప్రపంచ క్రికెట్లో బలమైన ఈ రెండు జట్ల మధ్య ఇప్పుడు టెస్టు సమరానికి సమయం ఆసన్నమవుతోంది. స్వదేశంలో అయిదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో భారత్‌ తలపడనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో ఈ సిరీస్‌ టీమిండియాకు ఎంతో కీలకం...

దీంతో ఇప్పుడు అందరి ఫోకస్‌ ఈ సిరీస్‌పై పడింది. తొలి టెస్టు ఈనెల 25న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఆరంభమవుతుంది. ఇక్కడి రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం.. టీమిండియాకు పెట్టని కోట. టెస్టుల్లో మన జట్టు ఇక్కడ ఓడిందే లేదు.

2005లో తొలిసారి ఉప్పల్‌లో వన్డే.. మరో ఐదేళ్ల తర్వాత మొదటి టెస్టు మ్యాచ్‌ జరిగింది. ఇప్పటివరకూ అయిదు టెస్టులు ఆడిన టీమిండియా నాలుగు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించింది. ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 2010లో ఉప్పల్‌‌లో భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. హర్భజన్‌ సింగ్‌ 111 పరుగులతో నాటౌట్‌గా అజేయ సెంచరీ సాధించాడు. 2012లో న్యూజిలాండ్‌పైనే ఇన్నింగ్స్, 115 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సొంతం చేసుకుంది. పుజారా 159 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లోనూ మెరిశాడు.

మ్యాచ్‌లో అశ్విన్‌ 12 వికెట్లు పడగొట్టాడు. 2013లో ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్, 135 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. పుజారా 204 పరుగుల్లో డబుల్‌ సెంచరీ చేశాడు. 2017లో బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో 208 పరుగుల తేడాతో భారత్‌ నెగ్గింది. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 204 పరుగులు తీశాడు దీంట్లో డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. 2018లో వెస్టిండీస్‌తో టెస్టులో 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో పంత్‌ 92 పరుగులు, రహానె 80 పరుగులు, పృథ్వీ షా 70 పరుగులు చేసి సత్తా చాటారు. ఉమేశ్‌ యాదవ్‌ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి ఉప్పల్‌ మైదానం ఫేవరెట్‌ గ్రౌండ్‌ అని చెప్పొచ్చు. ఇక్కడ అతని ప్రదర్శనే అందుకు నిదర్శనం. టెస్టుల్లో 5 ఇన్నింగ్స్‌ల్లో 75.80 సగటుతో 379 పరుగులు చేశాడు. ఓ డబుల్‌ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి తనకు అచ్చొచ్చిన వేదికలో ఈసారి మ్యాచ్‌ ఆడడం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ ఈ టెస్టుకు అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ ప్రకటించింది. ఇప్పుడు జట్టులో లేని వెటరన్‌ టెస్టు బ్యాటర్‌ పుజారాకు ఇక్కడ గొప్ప రికార్డు ఉంది. 5 ఇన్నింగ్స్‌ల్లో అతను 127.50 సగటుతో 510 పరుగులు సాధించాడు. అతనూ ఓ ద్విశతకం చేశాడు.

ఇక బౌలింగ్‌లో చూసుకుంటే ఉప్పల్‌లో స్పిన్నర్లదే ఆధిపత్యం. ఇప్పటివరకూ టెస్టుల్లో ఇక్కడ అత్యధిక వికెట్లు తీసిన టాప్‌- ఫైవ్ బౌలర్లలో నలుగురు స్పిన్నర్లే.... సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ 8 ఇన్నింగ్స్‌ల్లో 27 వికెట్లు తీయడంతో ఇక్కడి పిచ్‌ తలొంచిందనే చెప్పాలి. ఎలా కావాలంటే అలా బౌలింగ్‌ చేస్తూ అశ్విన్‌ వికెట్ల వేట కొనసాగించాడు.

ఆ తర్వాత వరుసగా జడేజా 15, ఉమేశ్‌ యాదవ్‌ 15, ప్రజ్ఞాన్‌ ఓజా 9, హర్భజన్‌ సింగ్‌ 7 వికెట్లు తీశారు. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ హైదరాబాద్‌లో టీమిండియా విజయఢంకా మోగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక్కడ తమ ఆటతో అలరించి, ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి, సిరీస్‌ను ఘనంగా ఆరంభిస్తే హైదరాబాదీలకు అంతకుమించిన ఆనందం ఉండదనే చెప్పాలి.

Tags:    

Similar News