IPL 2023: సీజన్ లో ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ఎవరు టాప్.. ఎవరు లీస్ట్..?!
IPL 2023: ఐపీఎల్ లో ప్రతి ఏటా ప్లే ఆఫ్స్ రేసు యమారంజుగా ఉంటుంది. ఈసారి కూడా రసవత్తరంగానే ఉంటుంది.
IPL 2023: ఐపీఎల్ లో ప్రతి ఏటా ప్లే ఆఫ్స్ రేసు యమారంజుగా ఉంటుంది. ఈసారి కూడా రసవత్తరంగానే ఉంటుంది. లీగ్ దశలో అన్ని జట్లు 14 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా ఇప్పటికే 10కి పైగా మ్యాచ్ లు ముగిశాయి. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటే..ఢిల్లీ చిట్టచివరి స్థానంలో నిలిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీని ఓడించిన ముంబై ఇండియన్స్ తన ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంటే..ఆర్సీబీ ప్రమాదంలో పడింది. ప్రస్తుతం ఏయే టీమ్ పరిస్థితి ఎలా ఉంది ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించేందుకు ఎన్ని మ్యాచ్ లు నెగ్గాలి..ఇలాంటి వివరాలను చూద్దాం
గుజరాత్ టైటన్స్
గత సీజన్ విజేత గుజరాత్ టైటన్స్ ఈసారి కూడా ఫుల్ ఫామ్ లో ఉంది. హార్దిక్ పాండ్య నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడగా 3 పరాజయాలు 8 విజయాలు నమోదు చేసి 16 పాయింట్లతో ఐపీఎల్ 2023 పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో ఉంది. ఈ టీమ్ ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ మూడింటిలో ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ నుంచి ఫాస్ట్ బౌలర్లు షమీ, రషీద్ ఖాన్ వరకు అనూహ్యంగా రాణిస్తున్నారు. కాబట్టి గుజరాత్ టైటన్స్ కు ప్లే ఆఫ్ బెర్త్ కన్ ఫామ్ అనే చెప్పుకోవచ్చు..
చెన్నై సూపర్ కింగ్స్
ధోనీ కెప్టెన్సీలోని సీఎస్ కేకు ప్లే ఆఫ్స్ అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఈ సీజన్ లో ఈ టీమ్ ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడి 6 గెలిచింది. 13 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. ఈ టీమ్ లో ఒకరిద్దరు మినహా ఆటగాళ్లందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ గట్టి ఆరంభాన్ని ఇస్తుండగా, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, కెప్టెన్ ధోనీ మిడిల్ ఆర్డర్ ను బలోపేతం చేస్తున్నారు. దీపక్ చాహర్ పునరాగమనంతో జట్టు బౌలింగ్ మరింత పుంజుకుంది. రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, మహీష్ తీక్షణ స్పిన్ విభాగానికి బలాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ టీమ్ మరో 3 మ్యాచులు ఆడాల్సి ఉంది. వీటిలో 2 మ్యాచుల్లో తప్పనిసరిగా నెగ్గాలి. అప్పుడే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించగలదు. ప్రస్తుతం సీఎస్ కే ఆటతీరు చూస్తుంటే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడమే కాకుండా టైటిల్ కోసం గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
ముంబై ఇండియన్స్
ఐపీఎల్ లో ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ తొలి ఓటమి తర్వాత మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడింది. వీటిలో 5 మ్యాచుల్లో ఓటమి చెందితే 6 మ్యాచుల్లో గెలిచింది. 12 పాయింట్లతో ముంబై ఇండియన్స్ పట్టికలో 3వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే 4 మ్యాచుల్లో 3 నెగ్గాల్సిన తరుణంలో ఆర్సీబీ బెంగళూరు పై విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఓపెనర్ ఇషాన్ కిషన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ ఫుల్ ఫామ్ లో ఉండడం ఈ టీమ్ కు కలిసివస్తోంది.
లఖ్ నవూ సూపర్ జెయింట్స్
ఈ సీజన్ లో లఖ్ నవూ సూపర్ జెయింట్స్ కూడా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు ఈ టీమ్ 11 మ్యాచ్ లను పూర్తి చేసుకుంది. మరో 3 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. 11 మ్యాచుల్లో 5 మ్యాచులు నెగ్గగా మరో 5 మ్యాచుల్లో ఓడింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. లఖ్ నవూ సూపర్ జెయింట్స్ 11 పాయింట్లతో టేబుల్ లో 4వస్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ కోసం ప్రస్తుతం తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో సమిష్టిగా రాణిస్తేనే జట్టు ముందంజ వేసే అవకాశం ఉంది. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే ఆడాల్సిన 3 మ్యాచుల్లో లఖ్ నవూ సూపర్ జెయింట్స్ తప్పనిసరిగా నెగ్గాల్సి ఉంది.
రాజస్థాన్ రాయల్స్
రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి కూడా లఖ్ నవూ సూపర్ జెయింట్స్ మాదిరిగానే ఉంది. ఈ టీమ్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో ఐదింట్లో నెగ్గింది 6 మ్యాచులు ఓడిపోయింది. 10 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఈ టీమ్ ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉండగా...ఈ మూడింటిలో నెగ్గితేనే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించగలదు.
కోల్ కతా నైట్ రైడర్స్
నితీష్ రాణా సారధ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ఆడిన 11 మ్యాచుల్లో ఆరింట ఓడి 5 మ్యాచులను గెల్చుకొని 10 పాయింట్లతో టేబుల్ లో 6వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో పంజాబ్ పై అద్భుత విజయం సాధించింది. ఇంకా మూడు మ్యాచులు ఉన్నాయి..ఈ మూడింటిలో కోల్ కతా నైట్ రైడర్స్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
బెంగళూరు జట్టు 7వ స్థానంలో ఉంది. ఈ టీమ్ ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడితే ఆరింటిలో ఓడింది 5 గెలుచుకుంది. ఈ టీమ్ ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. ఇంకా 3 మ్యాచులు మిగిలి ఉన్నాయి. ముంబై ఇండియన్స్ చేతిలో తాజా ఓటమితో ప్లే ఆఫ్స్ అర్హత అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. ఇప్పటి నుంచి ఆడే మూడు మ్యాచుల్లో ఏ ఒక్కదాంట్లో ఓడినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ఈ ఐపీఎల్ 16లో ముగిసినట్టే..
పంజాబ్ కింగ్స్
శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ సైతం 11 మ్యాచులను పూర్తి చేసుకుంది. ఆరు ఓటములు, 5 విజయాలు నమోదు చేసి 10 పాయింట్లతో పట్టికలో 8వ స్థానంలో ఉంది. మిగిలిన 3 మ్యాచుల్లో నెగ్గితేనే ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది.
హైదరాబాద్ సన్ రైజర్స్
హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ ప్రస్తుతం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటే తొమ్మిదవ స్థానంలో ఉంది. ఈ టీమ్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టేలా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ టీమ్ ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడితే కేవలం 4 మాత్రమే గెలిచింది. ఈ టీమ్ ఇంకా 4 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అయితే లఖ్ నవూ సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తో హైదరాబాద్ టీమ్ ఆడాల్సి ఉంది. బెంగళూరు మినహా మిగిలిన టీమ్లు చాలా బలంగా ఉన్నాయి. ఒకవేళ అన్ని మ్యాచుల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్
ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉంది. ఇప్పటివరకు ఈ టీమ్ 10 మ్యాచ్ లు ఆడగా..అందులో నాలుగు మ్యాచ్ లు గెలిచి ఆరు మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఈ టీమ్ ఇంకా 4 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా ఈ నాలుగింటిలో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది.
మొత్తంగా ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కు వెళ్లేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.