Gautam Gambhir: రహనేకి ఆట తక్కువ.. అదృష్టం ఎక్కువ
*టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి, అజింక్య రహనేపై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
Gautam Gambhir: టీమిండియా మాజీ ఆటగాడు, బిజేపీ ఎంపి గౌతమ్ గంభీర్ తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రితో పాటు భారత ఆటగాడు అజింక్య రహనేపై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి గొప్పలు చెప్పుకోవడం సరైనది కాదని, ఎవరూ కూడా గొప్పలు చెప్పుకోవద్దని, మన గురించి ఇతరులు మాట్లాడుకోవాలన్నాడు. గతంలో తాము ప్రపంచకప్ గెలిచిన జట్టు అత్యుత్తమైన జట్టు అని మేము ఎప్పుడు చెప్పలేదని ఆ మాట అభిమానులకే వదిలేశామని, అయితే ఇటీవల ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ భారత జట్టు గెలవడంతో ఈ విజయం 1983లో ప్రపంచకప్ గెలిచిన దానికంటే గొప్ప విజయమని రవిశాస్త్రి అనడం గంభీర్ తప్పుపట్టాడు.
ఇక అజింక్య రహనే తన ఆట వల్ల కాకుండా అదృష్టం వల్లనే ఇంకా టీంలో వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడని సెటైర్ వేశాడు. గత టెస్ట్ సిరీస్ లో తన బ్యాటింగ్ ప్రదర్శన అంతగా బాగాలేకున్నా వైస్ కెప్టెన్ గా ఉండటం వలనే జట్టులో స్థానం కోల్పోకుండా ఉన్నాడని తెలిపాడు. తాజాగా న్యూజిలాండ్ సిరీస్ లో కూడా అదే రిపీట్ అయిందని దీన్ని బట్టి చూస్తే రహనేకి ఆట కంటే అదృష్టమే ఎక్కువ ఉందని చెప్పకనే చెప్పాడు. ఇక రోహిత్ శర్మ కెప్టెన్ గా తన తొలి టీ20 సిరీస్ ని అద్భుతంగా మొదలుపెట్టాడని, కెప్టెన్ గా అతడిపై ఒత్తిడి కనిపించడం లేదని చెప్పుకొచ్చాడు.