IPL 2023: అతడు వద్దు మహాప్రభో.. ధోనీకి ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ఇంతకీ ఎవరు అతను..?
IPL 2023: అతడు వద్దు మహాప్రభో.. ధోనీకి ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ఇంతకీ ఎవరు అతను..?
IPL 2023: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటములకు కెప్టెన్ ధోనీ ఉదార స్వభారమే కారణమా... ఓ ఆటగాడి విషయంలో ధోనీ చూపిస్తున్న సాఫ్ట్ కార్నర్ టీమ్ విజయాలను ప్రభావితం చేస్తోందా..ఔననే అంటున్నారు క్రికెట్ అభిమానులు..చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడింది. వీటిలో ఐదింటిలో నెగ్గిన ధోనీ సేన మరో నాలుగు మ్యాచుల్లో పరాభవాన్ని మూటగట్టుకుంది. వరుస విజయాలతో లీగ్ టాపర్ గా నిలిచిన చెన్నై టీమ్ ఆ తర్వాత ఓటములతో పాయింట్ల పట్టికలో దిగజారింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా ఐదు మ్యాచులు ఆడాల్సి ఉంది. అయితే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే వీటిలో కనీసం నాలుగింటిలో నెగ్గాల్సి ఉంది. ఇంతటి క్లిష్టమైన పరిస్థితి ఎదురు కావడానికి కెప్టెన్ ధోనీ ఓ ఆటగాడిపై పెట్టుకున్న అపార నమ్మకమే కారణమని ఆ టీమ్ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. ఆ ఆటగాడు మరెవరో కాదు తుషార్ దేశ్ పాండే..చెన్నై ఓటమికి అతడినే పలువురు బాధ్యుడిని చేస్తున్నారు.
తుషార్ దేశ్ పాండే ఇప్పటివరకు జరిగిన 9 మ్యాచుల్లో 17 వికెట్లు తీశాడు. పర్పుల్ క్యాప్ హాల్డర్ గా కూడా ఉన్నాడు. అయితే అతడి బౌలింగ్ లో ప్రత్యర్థి టీమ్ లు ధారాళంగా పరుగులు సాధించడంతోనే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో తుషార్ కేవలం 4 ఓవర్లు వేసి 49 పరుగులు సమర్పించుకున్నాడు. తుషార్ వికెట్లు తీస్తున్నప్పటికీ ఓవర్ కు 11 పరుగులు చొప్పున సమర్పించుకుంటున్నాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ ను చెన్నై గెలవాల్సి ఉందని..కానీ తుషార్ వేసిన ఒక ఓవర్ లో పంజాబ్ జట్టు ఏకంగా 3 సిక్సర్లు బాదింది. అదే విజయాన్ని ప్రభావితం చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు.
తుషార్ ఓ వైపు భారీగా పరుగులు సమర్పించుకుంటూనే మరోవైపు అంతే స్థాయిలో వైడ్లు కూడా వేస్తున్నాడు. ప్రతి ఓవర్ లో తప్పనిసరిగా రెండు వైడ్లు ఉంటున్నాయి. మరి, ఈ బౌలర్ ను మార్చకుండా ధోనీ ఎందుకు సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాడని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తుషార్ ను తప్పించాలని లేదంటే ప్లే ఆఫ్స్ రేసు నుంచి జట్టు నిష్క్రమించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని హెచ్చరిస్తున్నారు. మరి, ధోని ఇకపై మ్యాచుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.