IPL 2021: ఐపీఎల్ పై కరోనా కాటు...చెన్నై జట్టులోనూ కరోనా కలకలం
IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ముగ్గురు కరోనా బారిన పడినట్లు యాజమాన్యం తెలిపింది.
IPL 2021: ఐపీఎల్ పై కరోనా కాటు వేస్తోంది. వరుసగా ఆటగాళ్లు కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఆటగాళ్ల భయం నిజమైంది. బీసీసీఐ ఇచ్చిన భరోసా చెల్లలేదు. కోల్కతా టీమ్ కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ లకు కరోనా బారిన పడగా తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ కొవిడ్ కలకలం రేగింది. ఆ జట్టు మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆటగాళ్లెవరికీ కరోనా సోకలేదని వెల్లడైంది.
అయితే చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్ క్లీనర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా, పాజిటివ్ వచ్చిన ముగ్గురికి నేడు మరోమారు పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా ఫలితాలను రెండుసార్లు నిర్ధారించుకోవాలని చెన్నై యాజమాన్యం భావిస్తోందని బీసీసీఐ వర్గాలు మీడియాకు తెలిపాయి.
చెన్నై జట్టుతో పాటు ఫిరోజ్ షా కోట్లా (ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్) గ్రౌండ్ సిబ్బందిలో ఐదుగురు కరోనా పాజిటివ్‌గా తేలారు. దీంతో వారిని ఐసోలేషన్ తరలించి చికిత్స అందిస్తున్నారు. చెన్నై జట్టు రెండు రోజుల క్రితం ముంబై ఇండియన్స్ తో తలపడింది. దీంతో చెన్నైతో పాటు ముంబై జట్టును కూడా ఐసోలేషన్‌కు వెళ్లమనే అవకాశాలు కనపడుతున్నాయి