IPL 2021: ఐపీఎల్ వాయిదాతో బీసీసీఐ కి నష్టం ఎంతో తెలుసా?

IPL 2021: పలువురు ఆటగాళ్లు వైరస్‌ బారిన పడటంతో మంగళవారం బీసీసీఐ ఈ సీజన్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Update: 2021-05-05 02:23 GMT

IPL 2021:(File Image)

IPL 2021: కరోనా కారణంగా ఐపీఎల్‌ 14వ సీజన్ అనూహ్యంగా వాయిదా పడటంతో దీనికి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలపై చర్చ మొదలైంది. లీగ్‌ ఆగిపోవడంతో బీసీసీఐకి సుమారు రూ. 2,200 కోట్ల వరకు నష్టం జరిగే అవకాశం ఉందని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. రెండు, మూడు రోజుల నుంచి బయో బుడగలోని పలువురు ఆటగాళ్లు వైరస్‌ బారిన పడటంతో మంగళవారం బీసీసీఐ ఈ సీజన్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఈ సీజన్‌ మధ్యలోనే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ.. రూ.2,000 కోట్ల నుంచి 2,500 కోట్ల మధ్య నష్టాల్ని చవిచేసే అవకాశం ఉందన్నారు. ఆయన అంచనా ప్రకారం సుమారు రూ.2200 కోట్ల మేర కోల్పోనుందని చెప్పుకొచ్చారు.

బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి ఏటా ఈ టీ20 లీగ్‌ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దానికి ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన ఆదరణ ఉంది. ఈ క్రమంలోనే అటు ప్రసారదార్లు (బ్రాడ్‌కాస్టర్లు), ఇటు స్పాన్సర్‌షిప్‌ల నుంచి బీసీసీఐ భారీ మొత్తంలో ఆదాయం ఆర్జిస్తుంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రసారం చేసేందుకు స్టార్‌ స్పొర్ట్స్ ఛానెల్‌ ఐదేళ్ల కాలానికి రూ.16,347 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఏటా 60 మ్యాచ్‌లకు రూ.3270 కోట్లు. ఒక్క మ్యాచ్‌కు దాదాపు రూ.54.5 కోట్లు. ఈ లెక్కన ఈ సీజన్‌లో ఇప్పటివరకు 24 రోజుల్లో 29 మ్యాచ్‌లు జరిగాయి. వాటికి గానూ స్టార్‌ స్పోర్ట్స్‌ రూ.1580 కోట్లు చెల్లించే వీలుంది.

ఇక మిగతా మ్యాచ్‌లు(ఐపీఎల్ 2021) జరగనందున బీసీసీఐకి రూ.1690 కోట్ల మేర నష్టాలు భరించాల్సి రావచ్చు. మరోవైపు ఇదే పద్ధతిలో టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్న ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వివో బీసీసీకి ఏడాదికి రూ.440 కోట్లు చెల్లించనుంది. అంటే ఈసారి అందులో సగం కన్నా తక్కువే వచ్చే అవకాశముంది. ఇవి కాకుండా అసోసియేట్‌ స్పాన్సర్లు అన్‌అకాడమీ, డ్రీమ్‌11, క్రెడ్‌, అప్‌స్టాక్స్‌, టాటా మోటార్స్‌ వంటి కంపెనీల నుంచి సైతం బీసీసీఐకి పెద్ద మొత్తంలో నష్టాలు రానున్నాయి. ఈ లెక్కలన్నీ కలిపితే సుమారు రూ.2200 కోట్లపైనే ఉంటుందని ఆ అధికారి లెక్కలేశారు. ప్రస్తుతానికి దేశం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని... ఇలాంటప్పుడు లీగ్‌ను వాయిదా వేయాలనే బోర్డు నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని మాత్రమే వారు చెప్పారు. అన్నింటికి మించి ఆటగాళ్ల క్షేమమే తమకూ ముఖ్యమని వారు స్పష్టం చేశారు.

Tags:    

Similar News