IPL 2022 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 మెగా వేలానికి సంబంధించిన తేదీలను బిసిసిఐ కి సంబంధించిన అధికారి ఒకరు తాజాగా ప్రముఖ వార్త సంస్థకి తెలిపాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12,13 తేదీలలో బెంగుళూరులో ఐపీఎల్ 2022 మెగా వేలం నిర్వహించడానికి బిసిసిఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అయితే గతంలో దుబాయ్ లో ఈ వేలం పాట నిర్వహిస్తారని వార్తలు వినిపించినా బిసిసిఐ మాత్రం భారత్ లోనే వేలం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ సమయానికి ఓమిక్రాన్ కేసులు పెరిగితే దుబాయ్ లో ఆక్షన్ నిర్వహించే అవకాశం ఉందని తెలిపాడు.
ఇప్పటికే ఉన్న 8 జట్లకు తోడు మరో రెండు జట్లు లక్నో, అహ్మదాబాద్ ఐపీఎల్ లో అడుగుపెట్టడంతో రిటైన్ ఆప్షన్ తో పాటు మెగా వేలం అనివార్యమయింది. సంజీవ్ గోయెంకాకు చెందిన వ్యాపార సంస్థ లక్నో ఫ్రాంచైజీని దక్కించుకోగా, వెంచర్ క్యాపిటల్ సంస్థ సీవీసీ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. అయితే ఈ ఇరు జట్లు ప్రస్తుతం ఉన్న ఆటగాళ్ళలో ముగ్గురి చొప్పున మెగా వేలం కంటే ముందుగానే ఎంపిక చేసుకునే అవకాశం బిసిసిఐ కల్పించింది. ఇప్పటికే లక్నో ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్ లను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జట్టుకు మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ మెంటార్ గా, జింబాబ్వే మాజీ క్రికెటర్ గ్రాంట్ ఫ్లవర్ ని కోచ్ గా నియమించుకున్నారు.