BCCI: ఐపీఎల్ 14వ సీజన్ కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ బయో బుడగలో పలు కరోనా కేసులు నమోదవ్వడంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లను బీసీసీఐ సెప్టెంబర్‌లో నిర్వహించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఐపీఎల్ ఇంగ్లాండ్ లో నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కీలక వ్యాఖ్య లు చేసింది. ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్‌లో మార్పులు చేయమని బీసీసీఐ కోరలేదని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు శుక్రవారం స్పష్టం చేసింది. ఆగస్టు 4 నుంచి ఆరంభం కానున్న టెస్టు సిరీస్ ముందుగా నిర్వహించమని బీసీసీఐ ఇంగ్లాండ్ బోర్డును కోరే అవకాశాలున్నాయని ఓ ఆంగ్ల కథనం రాసింది.
అయితే షెడ్యూల్ ప్రకారమే టెస్టు సిరీస్ నిర్వహిస్తామని ఈసీబీ తెలిపింది. ఐపీఎల్ అంశంపై బీసీసీఐ నుంచి తమకు ప్రతిపాదనలేవీ రానందున వెల్లడించింది. 'మేం తరచూ అనేక విషయాలపై బీసీసీఐతో మాట్లాడతాం. ముఖ్యంగా ఈ మధ్య కొవిడ్-19 పరిస్థితుల గురించి బాగా చర్చిస్తున్నాం. అయితే ఇప్పటివరకు టెస్టు సిరీస్‌లో మార్పుల గురించి మమ్మల్ని సంప్రదించలేదు. దాంతో మేం ముందు అనుకున్న ప్రణాళిక ప్రకారమే సాగుతున్నాం' అని ఓ ఈసీబీ ప్రతినిధి అన్నారు.
మిగిలిన 31 మ్యాచులు నిర్వహించకపోతే బీసీసీఐకి సుమారు రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందువల్ల ఇంగ్లాండుతో టెస్టు సిరీస్‌ను కాస్త ముందుకు జరపాలని భారత యాజమాన్యం వారిని సంప్రదించిందని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ అథర్టన్ ఓ పత్రికలో పేర్కొన్నాడు. అయితే ఈసీబీ మాత్రం తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని స్పష్టం చేసింది.