Team India Coach: టీమిండియా కోచ్ రేసులో కుంబ్లే, లక్ష్మణ్..!!

* భారత మాజీ ఆటగాళ్ళనే కోచ్ గా ఎంపిక చేయడానికి సుముఖంగా ఉన్న బిసిసిఐ * రేసులో అనిల్ కుంబ్లే, లక్ష్మణ్

Update: 2021-09-18 08:43 GMT

టీమిండియా కోచ్ రేసులో కుంబ్లే, లక్ష్మణ్ (ఫైల్ ఫోటో) 

Team India Coach: త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2021 తరువాత టీమిండియా కోచ్ బాధ్యత నుండి తప్పుకుంటున్న రవిశాస్త్రి స్థానంలో కొత్త కోచ్ ను ఎంపిక చేయడం కోసం బిసిసిఐ సన్నాహాలు మొదలుపెట్టింది. తాజాగా భారత జట్టు హెడ్ కోచ్ పదవికి ఇద్దరు పోటీపడనున్నట్లు సమాచారం. భారత జట్టు మాజీ ఆటగాడు లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఈ కోచ్ పదవి రేసులో ముందున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 2016లో భారత జట్టుకు కోచ్ పని చేసిన అనుభవంతో పాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనిల్ కుంబ్లే అయితేనే భారత జట్టుకు సరైన వాడని బిసిసిఐ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. కాని కోచ్ పదవి కోసం అనిల్ కుంబ్లే ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని బిసిసిఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

మరోపక్క హైదరాబాద్ సొగసరి బ్యాట్స్ మెన్ వివిఎస్ లక్ష్మణ్ కూడా కోచ్ పదవి రేసులో ఉన్నాడని తెలుస్తుంది. బిసిసిఐ కూడా లక్ష్మన్, అనిల్ కుంబ్లే వంటి సీనియర్ ఆటగాళ్ళు 100కి పైగా టెస్ట్ మ్యాచ్ లలో ఆడిన అనుభవంతో పాటు ప్రస్తుతం ఉన్న భారత జట్టులోని ఆటగాళ్ళ ప్రదర్శనని అంచనా వేయగలరనే నమ్మకంతో విదేశీ కోచ్ ని ఎంపిక చేయడానికి అంతగా ఆసక్తి చూపించట్లేదని తెలుస్తుంది. 2016 జూన్ లో అనిల్ కుంబ్లే హెడ్ కోచ్ గా ఎంపిక అయిన తరువాత ఏడాది కాలం బాధ్యతలు నిర్వహించిన జంబో ఆ సమయంలో విరాట్ కోహ్లితో మనస్పర్ధాలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఆ సమయంలో విరాట్ కోహ్లి ఒత్తిడి వల్లనే అనిల్ కుంబ్లేని బిసిసిఐ కోచ్ బాధ్యతల నుండి తొలగించి రవిశాస్త్రికి ప్రధాన కోచ్ పదవి పగ్గాలు అప్పగించారని కొందరు.. కుంబ్లేకి నచ్చకనే తానే స్వయంగా కోచ్ పదవికి రాజీనామా చేసాడని మరికొందరు అనుకున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఐపీఎల్ 2021 లో సన్ రైసర్స్ హైదరాబాద్ జట్టుకు వివిఎస్ లక్ష్మణ్ కోచ్ గా ఉండగా, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు అనిల్ కుంబ్లే కోచ్ గా వ్యవహరిస్తున్నారు. మరి భారత క్రికెట్ జట్టుకు రాబోయే కాలానికి రాబోయే కోచ్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిఉండాల్సిందే..

Tags:    

Similar News