Abhishek Sharma: అభిషేక్ శర్మ సెంచరీ బాదిన బ్యాట్ ఎవరిదో తెలుసా? ఆసక్తికర విషయం చెప్పిన యంగ్ బ్యాటర్..!
Abhishek Sharma: రెండో టీ20 మ్యాచ్‌లో జింబాబ్వేను ఓడించిన టీమిండియా.. అద్భుతంగా పునరాగమనం చేసింది.
Abhishek Sharma: రెండో టీ20 మ్యాచ్‌లో జింబాబ్వేను ఓడించిన టీమిండియా.. అద్భుతంగా పునరాగమనం చేసింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో అభిషేక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అభిషేక్ కెరీర్‌కు ఇది చాలా ప్రత్యేకమైనదిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గత మ్యాచ్‌లో అంటే అరంగేట్రం మ్యాచ్‌లో అభిషేక్ శర్మ జీరోకే పెవిలియన్ చేరాడు. అదే సమయంలో, తాజాగా BCCI ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో అభిషేక్ తన భావోద్వేగాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో అభిషేక్ తన స్పెషల్ బ్యాట్ స్టోరీని పంచుకున్నాడు.
అభిషేక్ శర్మ వాడిన బ్యాట్ ఎవరిది..
జింబాబ్వేపై భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌కు సంబంధించి, అభిషేక్ తన బ్యాట్‌తో కాకుండా శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో బ్యాటింగ్ చేశానంటూ చెప్పుకొచ్చాడు. తాను ఈరోజు నుంచి ఇలా చేయడం లేదని, చాలా సంవత్సరాలుగా తన బ్యాట్‌తోనే ఆడుతున్నానంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు.
అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. "నేను చాలా కష్టపడి సంపాదించిన శుభ్మన్ గిల్ బ్యాట్‌తో ఆడాను. శుభ్మన్ తన బ్యాట్‌ను అంత ఈజీగా ఎవ్వరికీ ఇవ్వడు. కానీ ఇది నాకు చివరి ఛాన్స్ అని నేను చెప్పాను. దీంతో ఎట్టకేలకు తన బ్యాట్‌ను నాకు అందించాడు. ఇదే ఉత్సాహంతో ఆడుతున్నాను. ఐపీఎల్‌లోనూ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాను' అంటూ తెలిపాడు.
అండర్-19 నుంచి ఇలా చేస్తున్నాను..
'అండర్ -14లో నేను బ్యాడ్ ఫాంలో ఉన్నాను. అండర్ 19లోకి వచ్చే సరికి ఈ బ్యాడ్ ఫాం నుంచి బయటపడాలని కోరుకున్నాను. దీంతో శుభ్మన్ గిల్ బ్యాట్‌తో బ్యాటింగ్ చేస్తానని చెప్పాను. తొలుత ఒప్పుకోని శుభ్మన్.. ఆ తర్వాత నా పరిస్థితి చూసి సరే అన్నాడు. ఈ క్రమంలో శుభ్మన్ ఓ మాట చెప్పాడు. దేని గురించి ఆలోచించవద్దు అంటూ ధైర్యం చెప్పాడు. అండర్-19 నుంచి నేను అతని బ్యాట్‌తో ఆడుతున్నాను. అప్పటి నుంచి అంతా బాగుంది. ఇక అతని బ్యాట్‌తోనే ఆడాలని నిర్ణయించుకున్నాను. తన బ్యాట్‌ను నాకు ఇచ్చిన శుభ్‌మాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ చెప్పుకొచ్చాడు.
అభిషేక్ ఇన్నింగ్స్‌తో భారత్ భారీ స్కోర్..
జింబాబ్వేతో ఆడిన తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అంతర్జాతీయ అరంగేట్రం చేసినా అక్కడ ప్రత్యేకంగా ఏమీ చేయలేక జీరో పరుగుల వద్ద ఔటయ్యాడు. కానీ, 24 గంటల్లోనే ఆడిన రెండో మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో, అభిషేక్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 163.83గా నిలిచింది.