India Vs Srilanka: 'భారత్‌తో సిరీస్ మేము ఆడం" అంటున్న శ్రీలంక ప్లేయర్స్
India Vs Srilanka: భారత్‌తో జరగాల్సిన టీ20, వన్డే సిరీస్ ముందు శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆ దేశ ఆటగాళ్లు ఊహించని షాక్ ఇచ్చారు.
India Vs Srilanka: గత కొద్ది రోజులుగా శ్రీలంక క్రికెట్ బోర్డు, క్రికెటర్లకు మధ్య కాంట్రాక్ట్ విషయంలో వివాదం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌తో జరగాల్సిన టీ20, వన్డే సిరీస్ ముందు శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆ దేశ ఆటగాళ్లు ఊహించని షాక్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం టీమిండియా, శ్రీలంక సిరీస్ జూలై 13 నుంచి కొలంబో వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈలోపే లంకకు చెందిన ఐదుగురు క్రికెటర్లు.. భారత్‌తో సిరీస్‌కు ముందు కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.
శ్రీలంక క్రికెట్ బోర్డు మొత్తం 24 మంది క్రికెటర్లకు కాంట్రాక్ట్ ఆఫర్ చేయగా.. విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, అషేన్ బండార, కసున్ రజిత, లసిత్ ఎంబుల్‌దెనియా సంతకం చేసేందుకు నిరాకరించారట. కాగా, ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న కుశాల్ మెండిస్, గుణతిలక, డిక్లెల్వా బయోబబుల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.
శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ త్వరలో ప్రారంభం కానున్న టీమ్ ఇండియా పర్యటన నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ తమను తీవ్రంగా అవమానించిందని ఆయన అన్నారు. శ్రీలంక పర్యటనకు ఒక సెకెండ్ గ్రేడ్ జట్టును పంపించిందని.. మాజీ వరల్డ్ ఛాంపియన్ అయిన శ్రీలంకకు ఇది పెద్ద అవమానమే అని ఆయన అన్నారు. బీసీసీఐ సెకెండ్ గ్రేడ్ జట్టును పంపిస్తున్నా శ్రీలంక క్రికెట్ పాలకులు ఏమీ చేయలేకపోయారు. వీళ్లు కేవలం టెలివిజన్ హక్కుల ద్వారా వచ్చే డబ్బు కోసమే ఈ ప్రతిపాదనకు ఓకే చేశారని రణతుంగా ఆరోపించారు.