''ఆహారమే ఓ మతం.. దానికి ప్రజల మతాలతో సంబంధం ఉండదు'' అని ప్రముఖ ఆహార సరఫరా సంస్థ జుమాటో పేర్కొంది. హిందువు కాడని జుమాటో తరఫున ఆహారాన్ని సరఫరా చేయడానికి వెళ్ళిన ఆ సంస్థ ఎగ్జిక్యుటివ్ వద్ద ఆహారాన్ని స్వీకరించడానికి నిరాకరించడమే కాకుండా, అతనిని విధుల నుంచి తప్పించాలని కోరిన వినియోగదారునికి బుధవారం జుమాటో తన ట్విట్టర్ లో పై విధంగా సమాధానమిచ్చింది. ఇటువంటి కోర్కెలు కోరుతున్న వారి వల్ల తమ వ్యాపారం తగ్గినప్పటికీ తాము చింతించబోమని ఈ సందర్భంగా జుమాటో స్పష్టం చేసింది. జుమాటో వైఖరి పట్ల పలువురు నెటిజన్లు తమ హర్షం వ్యక్తం చేశారు. కేవలం ఎగ్జిక్యుటివ్ మతం కారణంగా ఆహారాన్ని డెలివరీ తీసుకోను అన్న వినియోగదారునిపై నెట్టింట్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
మంగళవారం ఓ వ్యక్తి జుమాటో ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. దానిని జుమాటోకు చెందిన ఓ ముస్లిం ఎగ్జిక్యుటివ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు. ఈ సందర్భంగా ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి ఆ ఆహారాన్ని తీసుకోవడానికి నిరాకరించాడు. అంతే కాకుండా, ట్విట్టర్ లో అన్యమతస్తుడైన ఆ ఎగ్జిక్యుటివ్ ని విధుల నుంచి తొలగించాల్సిందిగా కోరుతూ ట్వీట్ చేశాడు. దానికి జుమాటో నిరాకరిస్తూ పై విధంగా ట్వీట్ చేసింది.
Food doesn't have a religion. It is a religion. https://t.co/H8P5FlAw6y
— Zomato India (@ZomatoIN) July 31, 2019