ఆషాడమాసం రాగానే మనకు తొందరగా గుర్తుచ్చేది బోనాల పండుగలే .. అసలు బోనాలు అంటే ఏమిటి ? ఈ సంప్రదాయం మనకీ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .. బోనం అంటే భోజనం అని అర్ధం ..ఎంతో భక్తీ శ్రద్దలతో చేసిన భోనాన్ని దేవతలకు నైవేద్యంగా పెడతారు .. వండిన అన్నంతో పాటు పాలు,పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.
పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము.. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు.
తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది. బోనాల పండుగ సందోహం గోల్కొండ కోట లోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.. అ తర్వాత తెలంగాణాలోని అన్ని ప్రాంతల్లోని ప్రజలు ఈ పండగను జరుపుకుంటారు ..