Kalki Avatar: కల్కి ఎవరు?.. ఎప్పుడు వస్తాడు?

Kalki Avatar Story in Telugu: భగవాన్ కల్కి ఉత్తరప్రదేశ్‌లోని శంభాల గ్రామంలో సుమతి, విష్ణుయశ్ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. వారి నలుగురు కుమారుల్లో కల్కి చిన్నవాడు.

Update: 2024-06-25 16:15 GMT

కల్కి ఎవరు?.. ఎప్పుడు వస్తాడు?

Kalki Avatar Story in Telugu: కల్కి ఎవరు? అద్భుతమైన ఊహకు ప్రాణం పోసినట్లుండే భారతీయ పురాగాథల్లో కల్కి పాత్ర ప్రత్యేకత ఏంటి? లోకమంతా కటిక చీకటి ఆవరించిన దుర్భర సందర్భంలో ధర్మమనే కాంతిని ప్రసరింప చేయడానికి శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో ప్రత్యక్షమవుతాడని భారతీయ పురాణాలు చెబుతున్నాయి.

విష్ణుమూర్తి పదవ అవతారం

హిందూ పురాణాల ప్రకారం ధర్మం మీద అధర్మానిది ఎప్పుడు పైచేయి అయినా సృష్టి క్రమాన్ని చక్కదిద్దడానికి మహావిష్ణువు రకరకాల అవతారాల్లో భూలోకంలో జన్మించారని భారత, భాగవత పురాణాలు చెబుతున్నాయి. ఆ క్రమంలో వచ్చే విష్ణువు పదో అవతారమే కల్కి. ఇదే విష్ణుమూర్తి చివరి అవతారమని హిందూ గాథలు చెబుతున్నాయి.

 కల్కి ఏం చేస్తాడు?

విశ్వ కాల చక్ర భ్రమణాన్ని వేదాలు నాలుగు యుగాలుగా విభజించాయి. అవి.. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ నాలుగు కాలావస్థల్లో ఇప్పుడు ఈ భూమి మీద కలియుగం నడుస్తోంది. కలియుగంలో దుష్ట శక్తుల ఆధిపత్యం పెరిగిపోయి, న్యాయం, ధర్మం క్షీణించినప్పుడు... సత్యాన్ని, ధర్మాన్ని స్థాపించడానికి మహావిష్ణువు కల్కి అవతారంలో భూమి మీదకు వస్తాడన్నది హిందువుల నమ్మకం. చీకటి యుగాన్ని తుడిచేసి ధర్మంతో ప్రకాశించే కొత్త యుగానికి, సత్య యుగానికి బాటలు నిర్మిస్తాడు కల్కి.

కల్కి ఎలా వస్తాడు?

దేవదత్త అనే తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ వస్తాడు కల్కి. దేవదత్త అనే అశ్వం స్వచ్ఛతకు, పవిత్ర కాంతికి ప్రతీక. ఆ గుర్రం మీద కల్కి మహా కరవాలంతో వస్తాడు. ఆ కత్తితో కల్కి అన్యాయాల్ని, అక్రమాల్ని చీల్చి చెండాడుతాడు. అతని రాక రాజసంతో వెలిగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. అతడి నుంచి వెలువడే కాంతితో మనిషి గుండెలో కటిక చీకటితో మగ్గుతున్న మారుమూలలు కూడా ప్రకాశిస్తాయట.

కల్కి ఎక్కడ జన్మిస్తాడు?

భగవాన్ కల్కి ఉత్తరప్రదేశ్‌లోని శంభాల గ్రామంలో సుమతి, విష్ణుయశ్ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. వారి నలుగురు కుమారుల్లో కల్కి చిన్నవాడు. త్రేతాయుగంలో దశరథుడికి రాముడు పెద్ద కొడుకుగా జన్మిస్తే, కలియుగంలో కల్కి చిన్నవాడిగా జన్మిస్తాడు.

విష్ణువు భార్య లక్ష్మీదేవి శ్రీలంకలో జన్మిస్తారని, ఆమె పేరు పద్మ అని, ఆమెకు అష్టసఖులు ఉంటారని కూడా హిందూ పురాణాలు చెబుతున్నాయి. పుట్టుకతోనే కల్కి దైవాంశ సంభూతుడిగా కనిపిస్తాడని, ప్రత్యేక శక్తులు చూపిస్తాడని, తన లక్ష్యం ఏమిటో సూటిగా తెలిసిన వ్యక్తిగా శక్తిమంతంగా ఎదుగుతాడని అంటారు.

ప్రతి కలియుగంలో కల్కి వస్తాడా?

కల్కి ప్రతి కలియుగంలో ఏమీ రాడని, కొన్ని కలియుగాల్లో విభిన్న రూపాల్లో వస్తాడని మహాభారత, మత్స్య, స్కంధ పురాణాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, ఒక కలియుగాన్ని పరుశురాముడు ముగించాడని మహాభారతం చెబుతోంది. మరో కలియుగంలో మహాదేవి అవతారంగా వచ్చి రాక్షస సంహారం చేసినట్లు దేవీభాగవతం చెబుతోంది.

అయితే, ఇప్పుడు మనం ఉన్న కలియుగంలో కల్కి వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కలియుగంలో మనం శ్వేత వరాహ కల్పంలోకి అడుగు పెడుతున్నాం. కల్పం అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు లేదా ఒక రాత్రి. రెండు కల్పాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక రోజు. మన లెక్కల్లో బ్రహ్మదేవుడి ఒక రోజు మకు 864 కోట్ల సంవత్సరాలు. భూమి మీద 25 వేల 920 కోట్ల సంవత్సరాలైతే బ్రహ్మకు ఒక నెల. అలాంటి 12 నెలలు కలిస్తే ఒక బ్రహ్మ సంవత్సరం. ఈ మహావిశ్వం వయసు అలాంటి 100 బ్రహ్మ సంవత్సరాలు.

ఈ కాలక్రమంలో ఇప్పుడు మనం బ్రహ్మదేవుడి 51వ సంవత్సరంలోని శ్వేతవరాహ కల్పంలోకి వెళ్తున్నాం. కాబట్టి, ఈ కల్పంలో కల్కి వస్తాడన్నది పురాగాథల సారాంశం.

 కల్కి వచ్చేనాటికి పరిస్థితులు ఎలా ఉంటాయి?

అధర్మం పెచ్చు మీరుతుంది. మనుషులు ఒకరినొకరు మోసం చేసుకుంటారు. నిజాయతీ పూర్తిగా కనుమరుగైపోతుంది. మనుషులు కర్మయోగను విస్మరించి, భోగలాలసలో మునిగిపోతారు. భౌతిక సుఖాల వెంట పరుగులు తీస్తారు. రకరకాల వ్యాధులు వస్తాయి. యౌవనంలోనే ప్రాణాలు పోతుంటాయి. అవినీతి పరులు, దొంగలు రాజ్యాధికారంలోకి వస్తారు. భూమి మీద వేడి పెరుగుతుంది. వర్షాలు తగ్గుతాయి. పూర్ణ చంద్రుడు కనిపించడు. వెన్నెల తరిగిపోతుంది. మనిషి సగటు జీవితం 16 ఏళ్ళకు పడిపోతుంది. ఏడెనిమిదేళ్ళకు పిల్లలను కనే పరిస్థితులు వస్తాయి. అరాచకం రాజ్యమేలుతుంది.

అలాంటి పరిస్థితుల్లో దేవతలంతా విష్ణుమూర్తి వద్దకు వస్తే. ఆయన కల్కి అవతారమెత్తుతాని చెబుతారు. కల్కిగా జన్మించి కలియుగాన్ని అంతం చేస్తాడని, ఉన్నత ధార్మిక విలువలతో కూడిన కొత్త యుగానికి ద్వారాలు తెరుస్తాడని హిందూ గాథలు చెబుతున్నాయి.

మహాభారతంలో కల్కిని ఒక ఆపద్బాంధవుడిగా వర్ణిస్తారు. సంక్షోభ సమయంలో ఈ భూమి మీదకు వచ్చి సజ్జనులకు జనన మరణాల సాంసారిక జగత్తు నుంచి విముక్తి కల్పిస్తాడని రాశారు.

హిందూ పురాణాల ప్రకారం కల్కి... కారు చీకటిలో కాంతి రేఖ.

Full View


Tags:    

Similar News