Wonder Village: ప్రకృతితో స్నేహం.. 30 ఏళ్లలో మరణించింది ఏడుగురే.. చావుకే సవాల్ విసురుతున్న గ్రామం

Wonder Village: ఇదో కుగ్రామం... ఇక్కడ సుమారు 30 కుటుంబాలు నివాసముంటున్నాయి. కేవలం వంద మంది జనాభా ఉంటారు.

Update: 2024-05-24 05:25 GMT

Wonder Village: ప్రకృతితో స్నేహం.. 30 ఏళ్లలో మరణించింది ఏడుగురే.. చావుకే సవాల్ విసురుతున్న గ్రామం

Wonder Village: ఇదో కుగ్రామం... ఇక్కడ సుమారు 30 కుటుంబాలు నివాసముంటున్నాయి. కేవలం వంద మంది జనాభా ఉంటారు. వీరి జీవనోపాధి వ్యవసాయం... ఇక్కడ తాజాగా పండించిన పంటలను ఆహారంగా తీసుకుంటారు. ప్రకృతితో మమేకమై.. కాలుష్యానికి దూరంగా ఉంటారు. 90 ఏళ్లకు పైబడి ఉన్న వారు కూడా వ్యవసాయం చేస్తూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. చావుకు సవాల్ విసురుతున్నారు కామారెడ్డి జిల్లా రాజమ్మ తండా వాసులు.

నేటి ఆధునిక కాలంలో కూడా సాంప్రదాయ పద్ధతులతో పంటలు పండిస్తూ... జీవనం సాగిస్తున్న కామారెడ్డి జిల్లాలోని రాజమ్మ తండా ఇతరులకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది. 30 ఏళ్లలో... ఏడంటే... ఏడుగురు మాత్రమే మరణించారంటే.. ఆ గ్రామస్తుల ఆరోగ్యం ఎంత చక్కగా ఉందంటే అతిశయోక్తి అవుతుందేమో... కాలుష్య వాతావరణంతో.. కల్తీ ఆహారం తీసుకుంటూ.. నిత్యం రోగాలతో మనుషులు సహవాసం చేస్తున్నారు. కానీ కామారెడ్డి జిల్లాకు చెందిన రాజమ్మ తండా మాత్రం ప్రకృతి జీవనాన్ని గుర్తు చేస్తోంది. కాలుష్యానికి, వ్యాధులకు దూరంగా పచ్చని ఒడిలో జీవిస్తోంది. కరోనా రెండు దశల్లోనూ ఒక్కరికి కూడా సోకలేదంటే ఆ తండా వాసుల జీవన శైలి అర్థం చేసుకోవచ్చు.

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రాజమ్మ తండా వాసులు ఆర్గానిక్‌ వ్యవసాయం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇక్కడి ప్రజలు ఆయు ప్రమాణాన్ని పెంచుకోవడమే కాదు ఆస్పత్రులకూ దూరంగా ఉంటున్నారు. సహజ సిద్ద వాతావరణంలో జీవించడంతో వారికి ఎలాంటి రోగాలు దరిచేరడం లేదు... 90 ఏళ్ల పైబడి ఉన్నవారూ వ్యవసాయం చేస్తూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. కట్టెల పొయ్యిపైనే వంట చేసుకుంటారు. ప్రధాన ఆహారం మొక్కజొన్న రొట్టె.. వెల్లుల్లి కారం... ఏ ఇంట్లో చూసినా రొట్టె లేకుండా ఒక్క పూట కూడా గడవదని తాండ వాసులు చెబుతున్నారు.

మినరల్‌ వాటర్‌ తాగడమే మంచి అని మనం అనుకుంటుంటే.. భూగర్భం నుంచి వచ్చే శుద్ధ జలాలనే అమృతంలా భావిస్తున్నారు ఈ తండా వాసులు. తాము సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి తమ ఆహార పద్ధతులే కారణమంటున్నారు తండావాసులు.

ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా బతుకుతున్నారు. చుట్టూ పచ్చని పొలాలు, అడవి గుట్టల మధ్య స్వచ్ఛమైన గాలి... వాతావరణం ఉండడంతో రోగాలు రావడం అరుదు... సహజ సిద్ధ వాతావరణంలో జీవనం.. ఆకుకూరలు, మొక్కజొన్న రొట్టెతో భోజనం చేయడంతో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటోన్న రాజమ్మ తండా మరికొంత మందికి స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం.

Tags:    

Similar News