తొమ్మిది నిమిషాల్లో 45 టీలు.. 30 రోజుల్లో 12 లక్షలు.. చాయ్ చమక్కు ఇదండీ!

మహరాష్ట్రలోని పూణేకు చెందిన ఓ వ్యక్తి ఆశ్చర్యంగా ఒకేసారి 45 కప్పుల చాయ్ తాగి రికార్డు సృష్టించాడు. మరో వ్యక్తేమో... జస్ట్ చాయ్ అమ్ముతూ నెలకు అక్షరాలా 12 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అయితే ఈ రెండు ఘటనలు మహారాష్ట్ర పూణేకి సంబంధించినవే కావడం కాకతాళీయం. వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా... ఇది చదివితే మీరూ అవునంటారు.. బోలెడు హాశ్చర్యపోతారు!

Update: 2019-09-19 11:00 GMT

పొద్దున్నే లేవగానే చాలా మందికి అది లేకపోతే తోచదు. అది లేకపోతే కొందరు, వాష్ రూమ్ కి కూడా వెళ్ళరు. మరికొందరైతే దాని కోసం ఎంత దూరమైనా వెళతారు. దాని మహత్యం అంతటిది మరి.

అవును ఆ టీక్కే వేరు అదేనండీ ఈ కిక్కే వేరు అంటున్నాను. ఆప్పుడెప్పుడో కాఫీ మీద పేరడీ రాసి జొన్నవిత్తుల కాస్త... పేరడీ విత్తులయ్యారు. అలాగే... టీ మీద, అరే చాయ్ తాగరా భాయ్ అంటూ...చంద్రబోస్ అద్భుతమైన పాట రాశారు. అంతే కాదండోయ్...మన ప్రధాని మోదీ కూడా ఓ చాయ్ వాలా... ఆ పాట, ఈ మాట సంగతి ఎలా ఉన్నా... యే చాయ్... చటుక్కున తాగరా భాయ్... ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్...యే చాయ్ ఖరీదులో చీప్ రా భాయ్... ఈ చాయ్ కుట్టీలనే చూపురా భాయ్.. యే చాయ్ గరీబుకీ విందురా భాయ్... ఈ చాయ్ నవాబుకి బంధువేనోయ్... ఈ చాయ్ మనస్సుకీ మందురా భాయ్... ఈ చాయ్ గలాసుకీ జై జై అంటాడు చిరంజీవి. మృగరాజు సినిమాలోని ఈ సాంగ్ చంద్రబోస్ రాయగా..చిరంజీవి పాడారు. అరుదైన ఈ పాట... ఆరోజుల్లోనే కాదు... ఈ రోజుకీ ఎవర్ గ్రీన్... చాయ్ ప్రాధాన్యాన్ని అంతగా చాటిందీ సాంగ్.

సాంగ్ సంగతి సరే, ఈ నసేంటని అనుకోకండి. మనస్సుకి మందులా పని చేసే ఈ చాయ్ కి సంబంధి ఇక అసలు విషయానికి వద్దాం. మహారాష్ట్రలోని పూణేకు చెందిన సచిన్ శిందే అనే వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 కప్పుల చాయ్ ని ఏకబిగిన తాగేశాడు. రికార్డు సృష్టించాడు. రిక్షా తొక్కుతూ జీవనం సాగించే సచిన్ శిందేకు చాయ్ మీద చాయ్ తెగ తాగేస్తుంటాడు. చైన్ స్మోకర్ లాగా చైన్ చాయ్ కర్ అన్నమాట. ఈ విషయం తెలిసిన అతడి మిత్రుడొకరు ఒక పాత్రలో 45 కప్పుల టీ పోసి ఆ మొత్తం టీని 20 నిమిషాల్లో తాగ గలవా? అని పందెం కాశాడు. అలా తాగితే వెయ్యి రూపాయలిస్తానని కూడా ఛాలెంజ్ చేశాడు. అంతే ఆ చాయ్ ని, పట్టుమని పది నిమిషాల్లోనే తాగేస్తానన్న సచిన్ శిందే కేవలం 9 నిమిషాల్లోనే లాగి పడేశాడు. అంతా చప్పట్లు కొడుతూ అభినందించారు.

ఇదిలా వుంటే మహారాష్ట్ర పూణేలోనే ఓ చాయ్ వాలా నెలకు ఏకంగా 12 లక్షల రూపాయలు సంపాదిస్తూ అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇలా లొట్టలేసుకుంటూ తాగేవాళ్ళుంటే అలా సంపాదించరా? అని మాత్రం అనమాకండి. మరి ఆ సంగతి కూడా చూద్దాం పదండి.

యేవ్ లే అమృత తుల్యం... యేవ్ లే చహా ఏక్ దా పీవున్ తర్ పహా... పేరుతో ఓ టీ కొట్టుంది. యేవ్ లే... పేరైతే... అమృత తుల్యమైన టీ అని, ఇక..ఒక్క సారి తాగితే... మళ్ళీ మళ్ళీ తాగాలనిపించే టీ అన్నది ట్యాగ్ లైన్. పేరుకు తగ్గట్లే ఆ టీకొట్టులో జనాలు ఎగబడి మరీ, మళ్ళీ మళ్ళీ టీ తాగేస్తున్నారట. అయితే, పూణేలోనే ఆ టీ కొట్టు నెల ఆదాయం ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. నోళ్ళు వెళ్ళబెట్టాల్సిందే ఒకటి కాదు రెండు కాదు నెలకు ఏకంగా 12లక్షల రూపాయలు! ఆశ్యర్యమనిపించినా ఇది అక్షరాలా నిజమండి. కేవలం టీ అమ్మడం ద్వారానే అంత సంపాదిస్తున్నాడు. టీ అమ్మడం ద్వారా సంపాదించడమే కాదు అనేక మందికి ఉపాధిని కడా కల్పిస్తున్నామంటున్నాడు యేవ్ లే టీ కొట్టు యజమాని. టీ కప్పులో తుఫాన్.. అంటారు. కానీ, టీ కప్పులో టేస్ట్ కి టేస్ట్... రిలీఫ్ కి రిలీఫ్....ఆదాయానికి ఆదాయం. ఉపాధికి ఉపాధి... ఇలా అనేకం ఉన్నాయి. అంతెందుకు... ఆ కిక్కే వేరప్పా...

అదీ సంగతి మరి... పోతూ పోతూ ఇంగ్లీష్ వాళ్ళు మనకు ఈ చాయ్ ని తగిలించిపోయాడని అనుకుంటూ ఉంటాం.. కానీ, ఇప్పుడు ఆ ఇంగ్లీష్ వాళ్ళకంటే మనమే ఎక్కువ టీ లాగేస్తున్నాం. లేక పోతే...మన పానం ఆ చాయ్ గుంజకపోతాది కదా!

Tags:    

Similar News