కొలమానాలు లేని బంధం అది. కాలమానాలతో సంబంధం లేని అనుబంధం అది. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ. ఎన్నిమాటలైనా సరిపోని నిర్వచనం అమ్మ ప్రేమ. మరణం అంచుల్లో కూడా జన్మనిచ్చేందుకు పడే తపన.. జవసత్వాలు జారిపోయే వరకూ బిడ్డకు తోడుండే ప్రేమచింతన! పేరాలూ.. పేజీలూ.. పుస్తకాలు సరిపోని వర్ణన అమ్మ ప్రేమ. ఒక్కరోజు మాతృదినోత్సవాన తలుచుకుంటే సరిపోయే భావన కాదది.. ఒకే ఒక్క రోజు స్మరించుకునే ప్రేమైక స్పందన కాదది.. జీవం ఉన్నంత వరకూ ఎన్ని బంధాలూ బంధుత్వాలూ.. స్నేహితాలూ మన జీవితంలో వచ్చిపోయినా.. తుది శ్వాస వరకూ అమ్మ చేతి బువ్వ.. నేర్పిన క్రమశిక్షణ పాఠం.. మన తోడు నీడగాముందుకు నడిపిస్తూనే ఉంటాయి. మాతృదినోత్సవం పేరుతొ ఘనంగా అమ్మ ప్రేమకు ప్రపంచవ్యాప్తంగా కృతజ్ఞతా సుమాలను అందిస్తున్న వేళ.. అమ్మతనం లోని మరో కోణాన్ని పరిచయం చేస్తున్నాం సాక్షర వినమ్రతతో..
ఒంటరి పోరాటం..
పద్మ పల్లె పచ్చదనంలో.. పైర్ల చల్లదనంలో.. కల్మషం తెలీని వాతావణంలో పెరిగిన పడతి. పదిహేడో ఏడు రాగానే.. మంచి సంబంధం వచ్చిందంటూ పెళ్లి పీటలు ఎక్కించేశారు. ఎవరిని ఎందుకు పెళ్లి చేసుకున్నామో అన్న అయోమయంలో ఉండగానే అత్తగారింట సంసారం.. భర్త ఊడబొడిచే ఉద్యోగం వెలగబెడుతున్న పట్టణానికి వేరు కాపరం వెళ్ళటం జరిగిపోయాయి. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేలోపే పండంటి బిడ్డ ఒడిలో చేరిపోయాడు. ఈ రెండేళ్ల లోనూ భర్త చేసే పనేమిటో తెలీదు. ఎలా సంపాదిస్తున్నాడో తెలీదు. కానీ, మూడిళ్లు మారారు. మారినప్పుడల్లా గందరగోళమే. పద్మ తల్లి సర్దుకుపొమ్మని చెప్పడం.. అడపా దడపా ఆర్థిక సహాయం చేయడం చేసేది. మరో రెండేళ్లు గడిచాయి. మరో బుజ్జాయి వారింట వచ్చింది. ఇపుడు ఇద్దరు పిల్లలతో పట్నంలో కాపురం మాటలు కాదు కదా.. నాలుగేళ్లలోనూ భర్త ఎక్కడా హోదా తగ్గకూడదనే ఆంక్షలతో ఎవరితోనూ సరైన సంబంధాలు లేవు. పైగా ఒడిదుడుకుల ఆర్థిక స్థితితో ఎవరికీ ఏమి చెప్పలేక.. పిల్లలకు ఏమి పెట్టలేక గుట్టుగా బ్రతకడం సాగించింది. ఓర్పుకు ఓ హద్దుంటుంది. ఆ హద్దు చెరిగిపోయే స్థితి వస్తే.. అందులోనూ పిల్లలకు ఇబ్బంది వస్తున్న పరిస్థితి తలెత్తితే ఏ తల్లైనా ఒక్కసారిగా గట్టులు తేగే ఆవేశంతో నిర్ణయం తీసుకుంటుంది. సరిగ్గా అదే పని చేసింది పద్మ. భర్తను నిలదీసింది. ఎన్నాళ్లిలా? ప్రశ్నించింది. సమాధానం దొరకలేదు. చివరికి ఒక నిర్ణయం తీసుకుంది. భర్త తరఫు బంధువులు వారించారు. సర్ది చెప్పాలని ప్రయత్నించారు. తల్లి అనునయించింది. మళ్ళీ ఆలోచించమని కోరింది. అయినా.. అప్పటికే ఓ స్థిర నిశ్చయానికి వచ్చిన పద్మ ససేమిరా ఎవరి మాటలకూ లొంగలేదు. వెనుకడుగు వేయలేదు.
భర్త అడిగాడు ఎలా బ్రతుకుదామనుకుంటున్నావని.. నాలుగిళ్ళలో కూలీ పని అయినా చేసుకుంటాను కానీ, ఇలా పనికిమాలిన ప్రతిష్ట కోసం పిల్లల్ని పస్తులు పెట్టి.. నవ్వుతూ ప్రపంచానికి కనబడడం.. అప్పు చేసి పప్పు కూడు తినడం నా వాల్ల కాదని కచ్చితంగా చెప్పేసింది. ఉంటే నాతో గుడిసెలో ఉండు.. లేకుంటే నీ దారి చూసుకో అని స్పష్టం చేసింది. అందుకా ప్రబుద్దుడు నీఖర్మ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇద్దరి మధ్య గొడవలు లేవు.. కోర్టులు లేవు.. మధ్యవర్తిత్వాలు లేవు.. విదాకులూ లేవు. విడి ఆకుల వివాహ బంధమే మిగిలింది.
ఏడో తరగతి పాసయిన పద్మకి ఇపుడు అసలు సవాలు మొదలైంది. ఏ రకమైన ఆలోచన లేదు. ఎలా బ్రతకాలో తెలీని అయోమయం. సరిగ్గా ఈ సమయంలో ఆమెకు తల్లి అండగా నిలబడింది. ధైర్యాన్ని ఇచ్చింది. చిన్న గది అద్దెకు తీసుకుని సంవత్సరం అద్దె చెల్లించింది. సంవత్సరానికి సరిపడా ఆహారపదార్థాల్ని సమకూర్చింది. సంవత్సరంలో నువ్వు కచ్చితంగా నీ కాళ్ళమీద నిలబడతావని స్థైర్యాన్ని నింపింది. ఇది మాతృత్వ పరిమళానికి మరో ఉదాహరణ. పల్లె నుంచి ఏ చదువూ లేని ఒక తల్లి తన కూతురికి ఇటువంటి స్ఫూర్తిని ఇవ్వడం ఊహించగలమా. అమ్మతనలోని గొప్పతనమే ఆమెకు ఆ ఆలోచన ఇచ్చింది. కావాలంటే ఆమె తన కూతుర్ని ఇంటికి తీసుకుపోయి తమతో ఉంచుకోవచ్చు. కానీ, తన కుమార్తెకు ఆమె ఆత్మగౌరవం కానుకగా ఇచ్చింది. ఆ కానుకే పద్మకు ప్రేరణ ఇచ్చింది.
ఒంటరిగా ఇద్దరు చిన్న పిల్లలతో ఏకాకిలా తన జీవిత ప్రయాణంలో మొదటి అడుగు వేసింది. ఆమె నివాసం ఉంటున్న ఇంటికి దగ్గరలోనే ఓ సంస్థలో చిన్న పని సంపాదించింది. చదువు ఉంటె తప్ప ఏమీ సాధించలేమని తెలుసుకుంది. మెల్లగా ప్రయివేటుగా డిగ్రీ చదివింది. కాలం వేగంగా పరిగెత్తింది. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. అవసరాలు పెరుగుతున్నాయి. ప్రపంచం కంప్యూటర్ల వెనుక పరిగెత్తుతోంది. తానూ పరిగెత్తకపోతే లాభం లేదనుకుంది. ఉద్యోగం.. పిల్లలు.. ఇంటి పని.. ఇన్ని ఒత్తిళ్ల మధ్య కంప్యూటర్ విజ్ఞానాన్నీ నేర్చుకుంది. ఆమె పనిచేసే సంస్థ ఆమెకు సహకరించింది. దాదాపు 20 ఏళ్ళు అదే సంస్థలో పనిచేసింది. పిల్లలు పెద్ద చదువులు చదివారు.
ఆమెకు తోడు.. నీడ.. అన్నీ పిల్లలే. అమ్మతనంలోని మాధుర్యం ఆమె కష్టాన్ని మరిపించింది. సమాజపు వెకిలి నవ్వులు పిల్లల మోముల్లోని నవ్వులు మరిపించాయి. పిల్లలు ఒక్కో క్లాసు దాటుతుంటే.. పెద్ద కష్టాలు కూడా చిన్నవైపోయాయి. ఈ క్రమంలో ఆమెకి సహకరించిన వాళ్ళున్నారు. గేలి చేసిన వారున్నారు. సహకరించిన వారినీ ఆమె మర్చిపోలేదు. గేలి చేసిన వారిని అసలు మరువలేదు. గేలి చేసిన వారికి సమాధానం పిల్లల్ని విజయవంతంగా పెంచిన ఆమె మాతృత్వ మాధుర్యమే. సహకరించిన వారందరికీ ఆమె ఓ అద్భుతం. ఆమె నివాసం పరిసరాల్లో వారికి ఆమె ఒక చైతన్యం. ఎక్కడి పల్లె.. ఎక్కడి పట్నం. పాతికేళ్ల వైవాహిక జీవితంలో వైఫల్య పాఠాన్ని గెలుపు బాటగా చేసుకుని ధైర్యంగా ముందడుగు వేసిన ఆ అమ్మ జీవితం స్ఫూర్తి దాయకం. పిల్లల్ని రెక్కలకింద దాచుకునే కోడిపెట్టాలా.. సమాజపు విపరీత పోకడల నుంచి రక్షించుకుంటూ వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన అమ్మతనానికి ఈ మాతృత్సవ దినోత్సవ వేళ జేజేలు చెబుదాం. మన సమాజం లో ఇలాంటి మాతృమూర్తులు ఎందరో ఉన్నారు. ఒంటరిగా.. ధైర్యంగా విలువల్ని నిలబెడుతూ ముందుకు సాగుతున్నారు. వారందరి విజయమే స్ఫూర్తిగా మాతృత్వవం ఒంటరి మాతృమూర్తులకు ఉషస్సులు పంచాలని కోరుకుందాం.
ఇపుడు మీకు పరిచయం చేసింది అందరికీ తెలిసిన అమ్మకథే! మన చుట్టూ ఉన్న అమ్మతనంలోని గొప్పతనాన్ని స్మరించుకోవడం కోసమే ఈ కథనం. అనివార్య కారణాల వల్ల పేర్లు మార్చి అందించాం. పేర్లు ఏవైనా మీ ఇంటి దగ్గర్లోనో .. మీ ప్రాంతంలోనో ఇలాంటి మాతృదేవతలు కచ్చితంగా ఉంటారు. వారిని సహ్రదయంతో అర్థం చేసుకుని మాట సాయం చేయగలిగితే చాలు. వారికి మనస్ఫూర్తిగా జేజేలు చెప్పండి.
మాతృదినోత్సవ శుభాకాంక్షలతో
మీ హెచ్ ఎం టీవీ