Miyazaki Mango: ఈ మామిడి పండ్లు కేజీ రూ.3 లక్షలు.. వీటికి ఎందుకంత ఎక్కువ రేటు?
Miyazaki Mango: కర్ణాటక ఉడుపి జిల్లాలోని శంకర్‌పుర్ పట్టణానికి చెందిన రైతు జోసెఫ్ లోబో ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు.
Miyazaki Mango: కర్ణాటక ఉడుపి జిల్లాలోని శంకర్‌పుర్ పట్టణానికి చెందిన రైతు జోసెఫ్ లోబో ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు.
తన 1,200 చదరపు అడుగుల టెర్రస్‌పై ఆయన అరుదైన పండ్ల మొక్కలను పెంచుతున్నారు. వీటిలో మియాజాకీ మామిడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
లేత ఎరుపు రంగులో కనిపించే ఈ మామిడి ఒక్కొక్కటి రూ.10,000 వరకు పలుకుతోంది. అదే కేజీ అయితే, రూ.3 లక్షల వరకు వెళ్తోంది.
ఇంతకీ ఈ మియాజాకీ మామిడి ప్రత్యేకత ఏమిటి, ఇది ఎందుకంత ఫేమస్, దీన్ని ఎలా సాగు చేస్తారు?
జపాన్ పుట్టినిల్లు
మియాజాకీ మిమిడి పళ్ల పుట్టినిల్లు జపాన్‌లోని మియాజాకీ ప్రాంతంగా చెబుతారు. సారవంతమైన నేల, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఈ మామిడి పళ్లు కాస్తాయి.
మియాజాకీ ప్రాంతం సమశీతోష్ణ ప్రాంత పరిధిలో ఉంటుంది. ఇక్కడ తగినంత సూర్యరశ్మి, గాలిలో తేమ, అగ్నిపర్వత విస్ఫోటం నుంచి వచ్చిన పదార్థాలతో ఏర్పడిన సారవంతమైన నేలలు మియాజాకీ మామిడి పండ్ల సాగుకు అనుకూలంగా ఉంటాయి.
అక్కడ మియాజాకీతోపాటు ఇలాంటి అరుదైన రుచులు, రంగులు కలిగిన మామిడి పండ్లు చాలా పెరుగుతాయి.
మియాజాకీ ప్రత్యేకత ఏమిటి?
మియాజాకీ సాగు కాస్త కఠినంగా ఉంటుంది. ఈ పళ్ల నాణ్యత దెబ్బ తినకుండా చూసేందుకు రైతులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటారు.
ఇక్కడ ఒక్కో మామిడి పండును చేతితో సంపర్కం చేయిస్తారు. దీంతో మేలిమి నాణ్యత గల పళ్లు వచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
మామిడి పెరిగేటప్పుడు కూడా ఆకారం సరిగ్గా వచ్చేలా చూసేందుకు సంచులు, అట్టపెట్టెలు లాంటివి కడుతుంటారు.
అద్భుతమైన రుచి, అందమైన ఆకారం, తక్కువగా అందుబాటులో ఉండటంతో ఈ పళ్లకు అంత ధర వస్తుంటుంది.
చేతితో సంపర్కం చేయించడం, ప్రతి పండుపై శ్రద్ధ పెట్టడం లాంటి పనులకు కార్మికులు కూడా ఎక్కువ మంది కావాలి. దీంతో ఈ మామిడి సాగుకు కూడా ఖర్చు కాస్త ఎక్కువే అవుతుంది.
భారత్‌లో సాగు ఇలా..
మియాజాకీ జపాన్‌లో మాత్రమే కాదు, భారత్‌లోనూ అక్కడక్కడా సాగు చేస్తుంటారు. అయితే, వీటికి పైన చెప్పుకున్న వాతావరణ పరిస్థితులు, సారవంతమైన నేల తప్పనిసరిగా ఉండాలి.
పశ్చిమ బెంగాల్ బీర్‌భుమ్ జిల్లాలోని దుబ్రజ్‌పుర్‌కు చెందిన షౌకత్ హుస్సేన్ అనే రైతు కూడా వీటిని పండిస్తున్నారు. సిలిగుడిలో ఇటీవల జరిగిన మ్యాంగో ఫెస్టివల్‌లో వీటిని ఆయన ప్రదర్శనకు ఉంచారు.
ఈ మొక్కలను తను బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చానని ఆయన చెప్పారు. ఆయన పండించిన ఈ పండ్లలో ఒకటి రూ.10,600కు అమ్ముడుపోయింది.
2017లోనూ జబల్‌పుర్‌కు చెందిన రైతు సంకల్ప్ సింగ్ పరీహర్ కూడా ఇలానే అనుకోకుండా తనకు దొరికిన టెంకను పాతి పెట్టారు. అయితే, చివరకు అది మియాజాకీ మామిడిగా తేలింది. ఈ మామిడి పళ్లను కాపాడుకునేందుకు ఆయన గార్డులను కూడా ఏర్పాటుచేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
విటమిన్-ఏ పుష్కలంగా
ఈ అరుదైన మామిడి పళ్ల రుచి కూడా అద్భుతంగా ఉంటుందని దీన్ని తిన్నవారు చెబుతుంటారు. వీటిలో విటమిన్-ఏ, విటమిన్-సీలతోపాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వ్యాధులతో పోరాడేలా రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ పోషకాలు తోడ్పడతాయి.
అంతేకాదు, ఈ మామిడిలో ఫైబర్, పొటాషియం, మెగ్నిషియం స్థాయిలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
అయితే, వీటిలో షుగర్ కంటెంట్ కూడా మిగతా పళ్లతో పోల్చినప్పుడు 15 శాతం ఎక్కువగానే ఉంటుంది. దీంతో మధుమేహులు వీటితో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
మరోవైపు బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ స్థాయిలు కూడా వీటిలో ఎక్కువగానే ఉంటాయి. కంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఇవి మేలు చేస్తాయి.
‘రెడ్ సన్’
మియాజాకీ మామిడి పండ్లను భారత్‌లో ‘రెడ్ సన్’, బెంగాలీ సూరత్ దిమ్ (రెడ్ ఎగ్) లాంటి పేర్లతో పిలుస్తుంటారు. ఈ పళ్లకు నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని పరీక్షలు పాసైన పళ్లను ‘ఎగ్స్ ఆఫ్ ద సన్ (తైయో నో తమగో)’ అని పిలుస్తారు.
కొంతమందికి మామిడి పళ్లు తింటే అలర్జీలు వస్తుంటాయి. అలాంటివారు వీటిని అసలు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
మరోవైపు మధుమేహంతోపాటు కిడ్నీల సమస్యలు ఉండేవారు కూడా వీటిని ఎక్కువగా తీసుకోకూడదని చెబుతున్నారు.
ఇలాంటివి మరికొన్ని కూడా..
మియాజాకీ తరహాలోనే మరికొన్ని మామిడి పళ్ల రకాలు కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి.
వీటిలో మొదటగా కోహితుర్ మామిడి గురించి చెప్పుకోవాలి. ఇవి కశ్మీర్ ప్రాంతంలో పండుతాయి. కమ్మని రుచితో ఆకట్టుకునే ఎరుపు రంగులో ఇవి ఉంటాయి.
అయితే, వీటిని పండించడం కొంచెం కష్టం. ప్రతి పనీ చేతితో కార్మికులే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక్కొక్కటి రూ.10,000 వరకు పలుకుతుంటుంది.
అల్ఫోన్సో కూడా ఖరీదైన మామిడే. ఇది ఎక్కువగా కొంకణ్ తీరంలో పండుతుంది. వీటికి విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. ఇది ఒక్కో పండు రూ.4,000 వరకు పలుకుతుంటుంది.
అయితే, ఈ మామిడి పళ్ల ధర అనేది అన్ని వేళల్లోనూ ఒకేలా ఉండదు. సీజన్, లొకేషన్, మార్కెట్ పరిస్థితులు లాంటివి ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. పైన పేర్కొన్న ధరలన్నీ అంచనాలు మాత్రమే.