స్టెతస్కోప్ కనుమరుగు కాబోతోందా, ఈ మెడికల్ డివైజ్‌కు కాలం చెల్లిందని నిపుణులు ఎందుకు చెబుతున్నారు?
Stethoscope: వైద్య వృత్తికి చిహ్నంగా భావించే స్టెతస్కోప్‌పై నేడు వైద్య వర్గాల్లో చాలా చర్చ జరుగుతోంది.
Stethoscope: వైద్య వృత్తికి చిహ్నంగా భావించే స్టెతస్కోప్‌పై నేడు వైద్య వర్గాల్లో చాలా చర్చ జరుగుతోంది. దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర గల ఈ వైద్య పరికరం నేటి మార్పులకు తట్టుకొని నిలబడుతుందా, లేదా కొత్త టెక్నాలజీకి దారి వదిలేసి బాధ్యతల నుంచి తప్పుకుంటుందా? అనేదే ఇక్కడ అసలు ప్రశ్న.
వైద్యులకు స్టెతస్కోప్‌తో విడదీయరాని అనుబంధం ఉంటుంది. నిజానికి చాలా మంది రోగులు వైద్యులను గుర్తుపట్టేది మెడలో స్టెతస్కోపు తోనే. కొంతమంది వైద్యులు తమ పదవీ విరమణ సమయంలో స్టెతస్కోపును గోడకు వేలాడదీస్తుంటారు. దీనిబట్టీ ఈ వైద్య పరికరానికి ఎంత విలువ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంతకీ స్టెతస్కోపు కనుమరుగయ్యే దశకు ఎలా వచ్చింది. దీని కథ ఎప్పుడు, ఎలా మొదలైంది, నేడు ఈ వైద్య పరికరం ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి?
చర్చ ఎలా మొదలైంది?
తాజాగా ముంబయిలోని బాంబే హాస్పిటల్‌లో ‘ఏఐ అండ్ హెల్త్‌కేర్’ పేరుతో ఒక సదస్సు నిర్వహించారు. దీనిలో స్టెతస్కోపు భవిష్యత్‌పై వైద్యుల చర్చల అనంతరం, స్టెతస్కోప్‌కు కాలం చెల్లిందా? అనే కథనాలు మీడియాలో కనిపించాయి. నిజానికి స్టెతస్కోప్‌కు చివరి క్షణాలు దగ్గర పడ్డాయని వార్తలు రావడం ఇదేమీ తొలిసారి కాదు. 2016లోనే ఈ వైద్య పరికరం పతనావస్థ మొదలైందని ‘గార్డియన్’ ఒక కథనం ప్రచురించింది.
‘‘స్టెతస్కోప్ కథ ముగిసిపోయింది. అది నేడు మరణించింది’’ అని గార్డియన్‌తో ఆనాడే న్యూయార్క్‌కు చెందిన భారత సంతతి కార్డియాలజిస్టు డాక్టర్ జగత్ నరూలా చెప్పారు. అయితే, అదే కథనంలో ఈ వాదనతో జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన పీడియాట్రిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. డబ్ల్యూ రీడ్ థాంప్సన్ విభేదించారు. ఆ దశకు వచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉందని థాంప్సన్ అన్నారు.
స్టెతస్కోపుల అవసరం ఏమిటి?
స్టెతస్కోపుల అవసరం ఏమిటో తెలుసుకోవాలంటే అసలు ఇది ఎలా ఉనికిలోకి వచ్చిందో మొదట తెలుసుకోవాలి. దీని కోసం మనం 1860లలోకి వెళ్లాలి. ఆనాడు మహిళల హార్ట్‌బీట్‌ను వినేందుకు వారి ఛాతీపై చెవి పెట్టి వినడమనే అభ్యంతరకర పరిస్థితి నుంచి అటు రోగులు, ఇటు వైద్యులు ఇద్దరినీ గట్టెక్కించేందుకు ఫ్రెంచ్ డాక్టర్ రెనే లయీనెక్ ఒక పేపర్ ట్యూబ్‌తో తొలినాటి స్టెతస్కోప్ తయారుచేశారు.
స్టెతస్కోప్ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. గ్రీకులో స్టెతోస్ అంటే ఛాతీ, స్కోపీన్ అంటే చూడటం. అయితే, ఆధునిక స్టెతస్కోప్‌కు ఆధ్యుడిగా ఐరిస్ డాక్టర్ ఆర్థుర్ లీరెడ్ పేరును చెబుతారు. రెండు చెవుల్లోనూ పెట్టుకోగలిగే ఆధునిక పరికరాన్ని 1851లో ఆయన తయారుచేశారు. ఆ తర్వాత కాలంలో దీనిలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.
ఎలా పనిచేస్తుంది?
హార్ట్‌బీట్, ఊపిరితిత్తులు, కడుపులోని పేగుల శబ్దాలను వినేందుకు ఈ స్టెతస్కోపులను ఉపయోగిస్తుంటారు. స్టెతస్కోప్ ప్రోబ్‌లతో పసిగట్టే ఈ శబ్దాలు ట్యూబ్‌ల గుండా ప్రయాణించి ఇయర్‌పీస్‌లలోకి చేరుతాయి. శబ్ద తరంగాలను కాస్త తీవ్రత పెంచి వైద్యులకు వినిపించేలా ఈ స్టెతస్కోప్ చేస్తుంది. దీని వల్ల రోగి శరీరంలోని శబ్దాలను వైద్యులు మెరుగ్గా వినగలుగుతారు. ఈ శబ్దాలను వినడం ద్వారా గుండె, ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయో వైద్యులు గుర్తించగలుగుతారు.
వస్తున్న సవాళ్లు ఏమిటి?
ప్రస్తుతం ఎలక్ట్రానిక్, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివైజ్‌లు అనలాగ్ వెర్షన్‌కు సవాల్ విసురుతున్నాయి. ముఖ్యంగా అల్ట్రాసౌండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్‌ఫోన్ యాప్స్ లాంటి టెక్నాలజీల నుంచి స్టెతస్కోప్ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఈ కొత్త టెక్నాలజీలతో గుండె కొట్టుకునేటప్పుడు ఇమేజ్‌లు కూడా తీసుకోవచ్చు. అంతేకాదు, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ గ్రాఫ్‌లను కూడా తీసుకోవచ్చు. అంతేకాదు ఈ కొత్త పరికరాలు టీవీ రిమోట్ పరిమాణంలో వస్తున్నాయి. వీటిని ఉపయోగించడం కూడా తేలికేనని నిపుణులు చెబుతున్నారు.
‘‘నేడు స్టెతస్కోప్ అనేది ఒక రబ్బరు గొట్టం మాత్రమే’’ అని వాషింగ్టన్ పోస్టుతో ప్రపంచ ప్రముఖ కార్డియాలజిస్టు ఎరిక్ టోపోల్ వాషింగ్టన్ పోస్టుతో చెప్పారు. ‘‘మీరు అన్నింటినీ నేరుగా చూడగలిగినప్పుడు, ఇంకా వినడంపైనే ఆధారపడటం ఎందుకు?’’ అని ఆయన ప్రశ్నించారు.
కథ ముగిసినట్లేనా?
అయితే, స్టెతస్కోప్ కథ ముగిసిందనే వాదనతో కొందరు నిపుణులు విభేదిస్తున్నారు. ‘‘ఇది అనలాగ్ రూపంలో చనిపోవచ్చు. కానీ డిజిటల్ రూపంలో మన ముందుకు వస్తుంది’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో రెస్పిరాలజిస్ట్ డాక్టర్ ల్యాన్సెలాట్ పింటో చెప్పారు.
అలానే ఈ కొత్త పరికరాల ధర కూడా నాలుగంకెల సంఖ్యల్లో ఉంటుందని, అదే ప్రస్తుత స్టెతస్కోప్ అయితే, రూ.300 కే అందుబాటులోకి వస్తుందని దిల్లీలోని లంగ్స్ ఇన్‌స్టిట్యూట్ నిపుణుడు డా. సాయిబాబా హెచ్‌ఎంటీవీతో చెప్పారు.
‘‘భారత్ లాంటి దేశాల్లో ఈ కొత్త టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడానికి చాలా సమయం పడుతుంది’’ అని ఆయన అన్నారు.
‘‘రోగులతో మాట్లాడి, వారి గుండెపై స్టెతస్కోప్ పెట్టి శబ్దాలు విన్నప్పుడు వైద్యుడికి ఒక అనుభూతి కలుగుతుంది. దీని వల్ల వారిద్దరి మధ్య సంబంధం, నమ్మకం బలపడతాయి. అంటే దీని ద్వారా మనం మానసికంగానూ రోగులకు ధైర్యం ఇస్తున్నట్లే’’ అని ఆయన అన్నారు.
ఇప్పుడప్పుడే భారత్‌లో డిజిటల్, ఎలక్ట్రానిక్, ఏఐ స్టెతస్కోపుల విప్లవం వస్తుందని తాను కూడా భావించట్లేదని నంద్యాలకు చెందిన కార్డియాలజిస్టు వీ దివ్య హెచ్ఎంటీవీతో చెప్పారు.
‘‘ఇక్కడ స్టెతస్కోప్ లేకపోవడం అంటూ ఉండదు. ఇది ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది’’ అని ఆమె అన్నారు.