Mother's Milk: తల్లిపాలు విక్రయించవచ్చా.. ఈ నిబంధనలు మీకు తెలుసా..?
Sale Of Mother Milk: అప్పుడే పుట్టిన శిశువుకు తల్లిపాలు అమృతంతో సమానం. అందుకే వైద్యులు డెలివరీ అయ్యాక వెంటనే పిల్లలకి పాలు తాగించమని సలహా ఇస్తారు.
Sale Of Mother Milk: అప్పుడే పుట్టిన శిశువుకు తల్లిపాలు అమృతంతో సమానం. అందుకే వైద్యులు డెలివరీ అయ్యాక వెంటనే పిల్లలకి పాలు తాగించమని సలహా ఇస్తారు. తల్లిపాలలో బిడ్డకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి. దీనివల్ల వారికి ఇమ్యూనిటీ పెరుగుతుంది. వ్యాధులను తట్టుకునే శక్తి వస్తుంది. అందుకే పిల్లలకు కనీసం 6 నెలలైనా పాలు ఇవ్వాలని వైద్యులు సూచిస్తారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది మహిళలకు బలహీనంగా ఉండడం, ఆరోగ్య కారణాల వల్ల పాలు రావడం లేదు. ఇలాంటి వారు తల్లిపాలను కొని తీసుకొచ్చి పిల్లలకు తాగిస్తున్నారు. అయితే కొంతమంది దీనిని బిజినెస్‌గా మార్చారు. అందుకే ఫుడ్ సేఫ్టీ స్టాండర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (fssai) తల్లి పాల విక్రయ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.
ఆహార నియంత్రణ సంస్థ తల్లి పాల విక్రయాలకు వ్యతిరేకంగా పలు ఫుడ్ స్టాల్స్‌ను హెచ్చరించింది. మానవ పాలను ప్రాసెస్ చేయడానికి, విక్రయించడానికి అనుమతిని జారీ చేయవద్దని అధికారులను ఆదేశించింది. కొన్ని సంస్థలు బహిరంగ మార్కెట్‌లో తల్లి పాలను విక్రయిస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తల్లి పాల విక్రయాలను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. FSS చట్టం 2006, దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం మానవ పాలను ప్రాసెస్ చేయడానికి, విక్రయించడానికి వీలులేదని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రతా కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేసింది.
FSS చట్టం, 2006, దాని కింద రూపొందించిన నియమాలు, నిబంధనలు ఉల్లంగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ స్టాల్స్, బిజినెస్, హోటల్స్ నిర్వాహకులను హెచ్చరించింది. FSS అధికారులుఇంకా తల్లి పాలు ప్రాసెసింగ్ లేదా అమ్మకంలో పాల్గొన్న ఎఫ్‌బీవోలకు ఎటువంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ మంజూరు చేయలేదని గమనించాలని కోరింది. తల్లిపాలు అవసరమైన పిల్లలకు మానవత్వంతో ఎవరైనా ఉచితంగానే ఇస్తారు. కానీ దీనిని కూడా వ్యాపారం చేయడం మంచిది కాదు. దీనివల్ల లేనిపోని సమస్యలు ఎదురవుతాయని అధికారులు చెబుతున్నారు.