పన్నెండేళ్ల బాలుని సాహసం.. కాపాడింది ఆరుగురి ప్రాణం!
సహాయం చేయడమంటేనే ఆమడ దూరం పారిపోతారు చాలామంది. వారి వద్ద ఎంత ధనం ఉన్నాసరే.. ఎవరైనా సహాయం కోసం వస్తే కనీసం మాట సహాయం కూడా చేయకుండా ముఖం చాటేస్తారు. అయితే, కొంతమందికి చిన్నతనంలోనే సహాయం చేయడమనే గుణం వచ్చేస్తుంది. అవసరమైతే తమ ప్రాణాలను పణంగా పెట్టైనా సరే ఆపదలో ఉన్నవారికి సహాయ పడతారు.
సహాయం చేయడమంటేనే ఆమడ దూరం పారిపోతారు చాలామంది. వారి వద్ద ఎంత ధనం ఉన్నాసరే.. ఎవరైనా సహాయం కోసం వస్తే కనీసం మాట సహాయం కూడా చేయకుండా ముఖం చాటేస్తారు. అయితే, కొంతమందికి చిన్నతనంలోనే సహాయం చేయడమనే గుణం వచ్చేస్తుంది. అవసరమైతే తమ ప్రాణాలను పణంగా పెట్టైనా సరే ఆపదలో ఉన్నవారికి సహాయ పడతారు. అటువంటి లక్షణాల్ని పుణికి పుచ్చుకున్న పన్నెండేళ్ల బాలుడు చేసిన సహాయం తో ఆరుగురు చిన్నారులు ఆపద నుంచి గట్టెక్కారు. సాహసంతో కూడిన సహాయం చేసిన ఆ బాలునికి స్థానిక ప్రభుత్వ అధికారులు సర్టిఫికేట్ ఇచ్చి సన్మానం చేసి ప్రోత్సహించారు. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలోని రాయచూర్‌లో వరదల కారణంగా అస్వస్థతకు గురైన ఆరుగురు చిన్నారులను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్స్ బయలుదేరింది. మార్గంలోని హిరెరాయనకుంపి గ్రామ సమీపంలో ఒక వాగుపై ఉన్న బ్రిడ్జి వరదల కారణంగా నీట మునిగిపోయింది. దీంతో అంబులెన్స్ డ్రైవర్‌కు రోడ్డు ఎంత లోతు మునిగింది అనే విషయం అర్థం కాక ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. అత్యవసర పరిస్థితి కావడంతో ఇంతలో అక్కడే ఆడుకుంటున్న వెంకటేష్(12) అనే ఒక బాలుడిని దారి చూపమని అడిగారు. వెంటనే ఆ బాలుడు అంబులెన్స్ బ్రిడ్జి దాటడానికి ఎంతో సాహసం ప్రదర్శించి నీటిలో పరిగెత్తడం ప్రారంభించాడు. ఆ బాలుడి నడక మార్గాన్ని అనుసరిస్తూ అంబులెన్స్ డ్రైవర్ సురక్షితంగా వాహనాన్ని రోడ్డు దాటించి అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రిలో చేర్చారు. బాలుడి సాహసాన్ని వీడియో తీసిన ఒక వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా నెటిజన్లు వెంకటేష్‌ను అభినందించారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు వెంకటేష్ ధైర్యానికి, సహాయం చేయాలన్న తపనకి 73వ స్వాతంత్రదినోత్సవం సందర్భంగా సత్కారం చేశారు.