బీహార్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్ష బీభత్సానికి నదులు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. వారికి ఆహారం కూడా దొరకని పరిస్థతి ఏర్పడింది. బీహార్ లోని సలాఖువా బ్లాక్ లోని సహర్సా గ్రామంలో పరిస్థతి మరింత దయానీయంగా మారింది. వందలాది మంది గ్రామస్తులు తినడానికి తిండి దొరకక తమ ఆకల్ని తీర్చుకోవడానికి ఎలుకల్ని పట్టి కాల్చి తింటున్నారు.
మేం కోసీ నది నీటి మధ్యలో చాల రోజులుగా చిక్కుకుపోయాం. మార్కెట్ కు వెళ్ళే రోడ్లన్నీ నీటితో మూసుకుపోయాయి. మేం తినడానికి తిండి గింజలు లేవు. అందుకే ఎలుకల్ని తింటున్నామని ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఇప్పుడే కాదు వరదలు వచ్చినప్పుడల్లా ఆ ప్రాంతంలో ఇదే పరిస్థితి ఉంటుందట. అక్కడికి ప్రభుత్వ సహకారం అందే పరిస్థితి ఉండదని వారు చెప్పారు. ఈ గ్రామంలో నివసించే వారిలో కొద్ది మంది ఎలుకలు పట్టడంలో సిద్ధహస్తులు. వారు ఎలుకల్ని పట్టి ఈ వరద సమయంలో అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు. కిలో 40 రూపాయలకు ఎలుకల్ని గ్రామస్తులకు అమ్ముకుంటారు. అయ్యో పాపం అనిపిస్తోంది కదూ.. కానీ, అక్కడి ప్రభుత్వానికి ఇది పట్టకపోవడం విచిత్రమే. విపక్షాలు ఈ విషయం పై ఇప్పుడిప్పుడే విమర్శలు గుప్పిస్తున్నాయంట. విమర్శించే బదులు వారికి ఎలా సహాయం చేయాలో ఆలోచిస్తే మంచిది అంటున్నారు విషయం తెలిసిన వాళ్ళు.