అట్లాంటిక్ సముద్రంలో తేలుతూ కదులుతున్న మంచుకొండ
* ఏ68ఏగా నామకరణం చేసిన శాస్త్రవేత్తలు * జార్జియా దీవులవైపు దూసుకొస్తున్న ఐస్‌బర్గ్ * వన్యప్రాణులకు తప్పని ముప్పు
అట్లాంటిక్ సముద్రంలో తేలుతూ కదులుతున్న ఓ పెద్ద మంచుకొండ పర్యావరణ ప్రేమికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఓ ద్వీపమంత పరిమాణంలో ఉండే భాగం.. ఐస్ బర్గ్ నుంచి విడిపోయింది. దీని సైజు 2వేల 600 చదరపు కిలోమీటర్లు ఉంటుందని అంచనా. దీనికి శాస్త్రవేత్తలు ఏ68ఏ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఇది అట్లాంటిక్ సముద్రంలో అలలతో పాటు కదులుతూ జార్జియా దీవులవైపు దూసుకొస్తున్నది.
మరోవైపు ఆ కొండ తమ తీరాన్ని తాకితే అక్కడి సముద్ర, వన్యప్రాణులు చనిపోతాయని దేశాలు ఆందోళన చెందుతున్నాయి. జార్జియాకు దక్షిణంగా అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఈ దీవులు బ్రిటన్ అధీనంలో ఉన్నాయి. మంచుకొండ తీరాన్ని తాకితే దీవులకే పరిమితమైన వైవిధ్యమైన చెట్లు, జంతుజాలం, సముద్ర జీవులను నష్టపోకతప్పదని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే అంచనా వేసింది. సముద్రంలోని జీవులు ఆహారం కోసం దూరంగా వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందని.. ఈ క్రమంలో అవి ఆకలితో చనిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇక.. ఈ ఐస్‌బర్గ్ మీద ఉండే జీవజాలంపై పరిశోధకులు ఆసక్తి కనబరుస్తున్నారు. మంచుదిబ్బ పగిలిపోయే ప్రక్రియను మొత్తం చిత్రికరించేందుకు ప్రయత్నిస్తున్నారు.